22A జాబితాలో భూములుంటే ఆందోళన వద్దు.. హక్కుదారుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

22A జాబితాలో చేరిన భూముల సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

ఆగస్టు 13, 2026 | నిజం న్యూస్

హైదరాబాద్: నిషేధిత జాబితా (22A)లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. 22A జాబితాలో చేరిన భూముల సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ 22A భూముల సమస్యను ప్రస్తావించారు. ఏదైనా కారణంగా భూమి 22A జాబితాలో చేరి ఉంటే, కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలాలు ఎక్కడికీ పోవని స్పష్టం చేశారు.

కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి సర్వే నంబర్‌లోని మొత్తం భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, కోర్టు కేసులు ఉన్న స్థలాలను పక్కనపెట్టి మిగిలిన భూములకు బై-నంబర్లు ఇచ్చి సమస్యను పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కూకట్‌పల్లి ప్రాంత అభివృద్ధిపై సీఎం మాట్లాడుతూ.. రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, పాఠశాలలు, కాలేజీలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన పరిశ్రమల విషయంలో నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు గత పాలనతో ప్రస్తుత రెండేళ్ల పాలనను బేరీజు వేసుకోవాలని సీఎం అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఏవీ నిలిపివేయలేదని, అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని వివరించారు.

రాష్ట్రంలోని 3.28 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశామని పేర్కొన్నారు.

ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఉద్యోగం, ఉపాధి, చదువుల కోసం వెళ్లేవారు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా చేసుకుంటున్నారని సీఎం తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీకి రూ.12 వేల కోట్లు చెల్లించామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించి రూ.2,500 కోట్ల వడ్డీ చెల్లించామని వివరించారు.

మహిళా సంఘాల పేరిట వెయ్యి బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకిచ్చామని, వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం కల్పించామని సీఎం తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా బజార్ల ఏర్పాటుకు స్థలం కేటాయించామని చెప్పారు.

ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రెండేళ్లు పూర్తయ్యేలోపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో వందల కోట్ల విలువైన 11 ఎకరాల స్థలంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం గొప్ప కార్యక్రమమన్నారు.

నగరంలో నిరుపేదలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే వారికి ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. పేదల కోసం నిర్మించే ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని మంత్రులకు సూచించారు. నిర్మించే ఇళ్లకు స్థలాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.

నిర్మాణ వ్యయంలో రూ.5-6 లక్షలు లబ్ధిదారులు భరిస్తే, ఇల్లు నిర్మాణంలో ఉన్న సమయంలో పనులను పరిశీలించే హక్కు వారికి ఉంటుందని సీఎం వివరించారు. నిరుపేదలకు సొంత ఇళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సొంతింటి కల నెరవేరేందుకు నూటికి నూరు శాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మొదటి విడతలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో నివసిస్తున్న పేదలకు, అలాగే ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉపాధి కోసం నగరానికి వలస వచ్చిన వారికి మంచి ఇళ్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

గతంలో ఏదైనా పని కోసం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రజల సౌకర్యార్థం సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

“మీ అభివృద్ధి కోసం నిలబడతా. పది మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. మంచి చేయడానికి చిత్తశుద్ధి, మంచి ఆలోచన అవసరం. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించేందుకు రోజుకు 18 గంటలు పనిచేసే శక్తిని దేవుడు ఇచ్చారు. అందుకు ప్రజలు కూడా ఆశీర్వదించాలి” అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

-శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో,నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button