సైబర్ మోసంలో డబ్బు పోయిందా?.. ఇక నేరుగా మీ ఖాతాలోకే రీఫండ్!
సైబర్ మోసాల్లో నిలిపివేయబడిన లేదా ఫ్రీజ్ చేసిన నిధులను అర్హులైన బాధితులకు వేగంగా తిరిగి అందించేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (Money Restoration Module – MRM)ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్,16 జూలై 2026 – నిజం న్యూస్
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి కష్టార్జిత డబ్బును కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) శుభవార్త తెలిపింది.
సైబర్ మోసాల్లో నిలిపివేయబడిన లేదా ఫ్రీజ్ చేసిన నిధులను అర్హులైన బాధితులకు వేగంగా తిరిగి అందించేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (Money Restoration Module – MRM)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా బాధితులు తమ రీఫండ్ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ తెలిపిన వివరాల ప్రకారం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు నమోదు చేసిన అర్హులైన బాధితులకు రీఫండ్‌కు సంబంధించిన SMS లేదా నోటిఫికేషన్ అందుతుంది. అనంతరం వారు MRM ద్వారా తమ దరఖాస్తును సమర్పించాలి. చట్ట అమలు సంస్థలు, సంబంధిత బ్యాంకులు సంయుక్తంగా ధృవీకరించిన తర్వాత అర్హులైన బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు నేరుగా జమ చేయబడుతుంది.
ఇప్పటి వరకు సైబర్ మోసాలకు గురైన బాధితులు తమ డబ్బు తిరిగి వస్తుందో లేదో అనే ఆందోళనలో ఉండేవారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల రీఫండ్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శకత కూడా పెరగనుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించడం ఈ మాడ్యూల్ ప్రత్యేకతగా అధికారులు పేర్కొంటున్నారు.
రీఫండ్ కోసం ఇలా దరఖాస్తు చేయాలి
సైబర్ క్రైమ్ ఫిర్యాదుకు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా గుర్తింపును ధృవీకరించాలి. అనంతరం అర్హత కలిగిన ఫిర్యాదు, సంబంధిత బ్యాంకు ఖాతాను ఎంపిక చేసి అవసరమైతే PAN కార్డు వివరాలను అప్లోడ్ చేయాలి. అన్ని వివరాలను మరోసారి పరిశీలించి రీఫండ్ అభ్యర్థనను సమర్పించాలి. దరఖాస్తు విజయవంతంగా నమోదైన తర్వాత సంబంధిత అధికారులు, బ్యాంకులు ధృవీకరణ పూర్తి చేయగానే డబ్బు నేరుగా బాధితుడి ఖాతాలో జమ అవుతుంది.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు, KYC అప్‌డేట్ పేరుతో బ్యాంకు వివరాలు సేకరించడం, ఉద్యోగాల పేరుతో మోసాలు, QR కోడ్ స్కామ్‌లు, సోషల్ మీడియా అకౌంట్ల హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయకూడదని, OTP, బ్యాంకు వివరాలు, UPI PIN ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే నిధులను ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొంటున్నారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రవేశపెట్టిన మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ సైబర్ నేరాల బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే కాకుండా, డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచే కీలక సంస్కరణగా నిలవనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



