చురుగ్గా కదులుతున్న నైరుతి.. నేడు రాష్ట్రమంతటా విస్తరణ

వచ్చే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్, హైదరాబాద్‌, జూన్‌ 23:

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 15 రోజులుగా అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌ ప్రాంతాల వరకు మాత్రమే విస్తరించి నిలిచిపోయిన రుతుపవనాలు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయని అధికారులు తెలిపారు.

సోమవారం నాటికి నైరుతి రుతుపవనాలు నిజామాబాద్‌ ప్రాంతం వరకు విస్తరించాయని, మంగళవారం నాటికి తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాపించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

వచ్చే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. మంగళవారం, బుధవారం రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటున 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే పలుచోట్ల మేఘావృత వాతావరణం నెలకొనగా, సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.

అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, రైతులు వాతావరణ సూచనలను అనుసరించాలని సూచించారు. మరోవైపు, వర్షాలు సాగు పనులకు అనుకూలంగా మారనున్నందున రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది.

_శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button