రూ. 2 కోట్ల CMR బియ్యాన్ని ఎగ్గొట్టిన ఉత్తమ్ అనుచరుడు..?

హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఒక రైస్ మిల్లులో సుమారు రూ. 2 కోట్ల వరకు కస్టమ్ మిల్లింగ్ ఇచ్చిన బియ్యాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మిల్లు యజమాని అమరవరం కాంగ్రేస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, ఉప సర్పంచ్ కాగా, అతని భార్య కాంగ్రేస్ పార్టీకి సర్పంచ్ గా ఎన్నికవడం గమనార్హం.

రూ. కోటి ఫైన్ వేసిన అధికారులు..!

భార్య సర్పంచ్ గా గెలవడం కోసం సీ.ఎం.ఆర్ సొమ్ము వాడుకున్నాడన్న ఆరోపణలు…?

మంత్రి ఉత్తమ్ కు ఇదంతా తెలియదా..?

అమరవరం వెంకట సాయి రైస్ ఇండస్ట్రీపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో..?

హైదరాబాద్, మార్చి 13(నిజం చెపుతాం):

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్ మిల్లింగ్ లో (సీ.ఎం.ఆర్) బకాయి పడిన రైస్ మిల్లుల పై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నామని చెపుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వని మిల్లులపై దాడులు చేస్తూ, కోట్లాది రూపాయల విలువైన ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.

మరి ఈ తనిఖీలు సూర్యాపేట జిల్లాలోని కీలక నియోజకవర్గాలైన హుజూర్ నగర్, కోదాడల సరిహద్దుల వద్దే ఎందుకు ఆగిపోయాయన్నది రెండు నియోజకవర్గాల్లో చర్చనీయంగా మారింది.

రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అధికారులు చురుకుగా తనిఖీలు నిర్వహించి దాడులను చేస్తుంటే ఉత్తమ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం అధికారులు ఎందుకు దాడులు నిర్వహించడం లేదనేది సవాలక్ష ప్రశ్నలు. ఈ రెండు నియోజకవర్గాల్లో అక్రమాలు జరగడం లేదా..? లేక మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కనుక అధికారులు అడుగు పెట్టడానికి భయపడుతున్నారా..? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

వాళ్ల అనుమానాలను నిజం చేస్తూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఒక రైస్ మిల్లులో సుమారు రూ. 2 కోట్ల వరకు కస్టమ్ మిల్లింగ్ ఇచ్చిన బియ్యాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మిల్లు యజమాని అమరవరం కాంగ్రేస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, ఉప సర్పంచ్ కాగా, అతని భార్య కాంగ్రేస్ పార్టీకి సర్పంచ్ గా ఎన్నికవడం గమనార్హం.

నాలుగు సార్లు మెమోలను ఇచ్చిన అధికారులు….

హుజూర్ నగర్ మండలం లోని అమరవరం గ్రామంలో ఉన్న వెంకట సాయి రైస్ ఇండస్ట్రీ లో 2017 నుండి 2022 వరకు కస్టమ్ మిల్లింగ్ బియ్యంను అప్పగించకుండా ఉండటంతో అధికారులు సదరు మిల్లు యాజమాన్యానికి 24-11-2025 న మెమో నెంబర్ 2809/సీఎస్.1- సీసీఎస్ కింద మొదటి సారి నోటీసులను పంపారు. రెండో సారి 03-12-2025న నెంబర్ సీఎస్7 /194/2025 న, 02-12-2026న, 04-02-2026న మెమోలను పంపారు.

దీంతో మిల్లు యాజమాన్యం కోతుల వల్ల, వర్షాలకు ధాన్యం తడిచి పోవడంతో నష్ట పోయామని, తమకు కస్టమ్ మిల్లింగ్ చేసిన చార్జీలు అప్పజెప్పగా మిగిలిన డబ్బును చెల్లిస్తామని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. బియ్యాన్ని అప్పగించడంలో ఆలస్యం చేస్తుండటంతో సివిల్ సప్లై అధికారులు సుమారు రూ. కోటి వరకు జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.

2 కోట్ల సీఎంఆర్ బియ్యాన్ని ఎగ్గొట్టిన వెంకట సాయి రైస్ ఇండస్ట్రీ…

హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామంలో ఉన్న వెంకట సాయి రైస్ ఇండస్ట్రీ 2 కోట్ల సీ.ఎం.ఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా ఎగ్గొట్టినట్లుగా అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. 2017-18 రబీ సీజన్లలో ఈ రైస్ మిల్ కు 2191.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కు అప్పగించినప్పుడు
1468.613 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ను ఇవ్వాల్సి ఉండగా 1468.410. మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఈ సంవత్సరం 0.203 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ఎగ్గొట్టినట్టు తెలుస్తుంది. 2018- 19, 2020, 2021 సంవత్సరాలలో సదరు మిల్లుకు కేటాయించిన బియ్యo ని పూర్తి స్థాయిలో అప్పగించినట్టు తెలుస్తుంది. 2021- రబీ 3347.080 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించగా 2251.527 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా 2251.100 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించినట్టు తెలుస్తుంది.

ఈ సంవత్సరం కూడా 0.427 మెట్రిక్ టన్నుల సీ.ఎం.ఆర్ బియ్యాన్ని ఎగ్గొట్టినట్టుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 2021- 22 ఖరీఫ్ లో 4029.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కు అప్పగించగా 2700.046 మెట్రిక్ టన్నుల సీ.ఎం.ఆర్ బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా 1709.330 మెట్రిక్ టన్నుల సీ.ఎం.ఆర్ బియ్యాన్ని ఇవ్వలేదని అధికారులు తెలుపుతున్నారు.

ఈ సీజన్ లో 990.716 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వకుండా పెద్దమొత్తంలో ఎగ్గొట్టినట్టుగా అధికారులు చెబుతున్నారు. 2017 – 18 లో 0.203, 2020 -21 లో 0.427, 2021- 22 లో 990.716 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మొత్తం గా మూడు సంవత్సరాల మీద 991.346 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని అధికారులకు అప్పగించకుండా ఎగనామo పెట్టినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ మొత్తం కలుపుకొని సుమారుగా 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

సీ.ఎం.ఆర్ సొమ్మును సర్పంచ్ ఎన్నికలలో వాడుకున్నాడా…?

స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ) ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఈ అక్రమ సంపాదన నుండి తను , తన వార్డు సభ్యుల గెలుపు కొరకు, తన సతీమణి సర్పంచ్ గా విజయం సాధించే కొరకు ఖర్చు చేసినట్లు, మరికొంత మొత్తంలో డబ్బులు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గెలుపు కోసం అవినీతి సొమ్మును ఖర్చు పెట్టడంపై ప్రజలు మండిపడుతున్నాయి.

మిల్లు యజమాని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు, వైస్ సర్పంచ్, అతని భార్య కాంగ్రేస్ పార్టీ సర్పంచ్ గా గెలుపొందాడు. తాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడినని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఈ కుంభకోణానికి పాల్పడినట్లు సమాచారం.

మంత్రి ఉత్తమ్ కు ఇదేమి తెలియదా…?

రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల పై అధికారులు దాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గలైనా హుజూర్ నగర్, కోదాడ లో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్న ఎందుకు దాడులు జరగడం లేదు.

ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ మంత్రి మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన పేరు వాడుకొని కోట్ల రూపాయల దందా చేస్తున్న సదరు మిల్లర్ పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?

నోటీసులతోనే ఎందుకు సరి పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఈ విషయం మంత్రికి తెలియదా..? లేక అధికారులు ఆయనకు విషయం చెప్పడం లేదా అన్నది అర్థం కాని ప్రశ్న.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button