మణుగూరులో వేలాది చెట్ల నరికివేతపై ఆదివాసీల సమరభేరి!

చెట్ల నరికివేత వల్ల అటవీ జంతువుల ఆవాసాలు ధ్వంసమై, అవి జనావాసాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటవీ అధికారుల అండతోనే విధ్వంసం..

 

•28న ఎఫ్‌డీఓ కార్యాలయం ముట్టడి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,మణుగూరు ఫిబ్రవరి 24 (నిజం చెపుతాం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో ఇసుక ర్యాంపుల ఏర్పాటు పేరుతో జరుగుతున్న అడవుల విధ్వంసం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెను దుమారం రేపుతోంది. అడవులను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే, ఇసుక కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తికి సహకరిస్తూ పచ్చని చెట్లను బలి తీసుకుంటున్నారని ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

*అధికారుల అండతోనే అక్రమాలు?*

తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలేం కోటి ఈ అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుక ర్యాంపుల కోసం మార్గాలను సుగమం చేసే క్రమంలో వేలాది చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారని, దీని వెనుక అటవీశాఖ అధికారుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

“సామాన్యులు తమ అవసరాల కోసం కట్టెలు కొట్టినా, అడవిలోకి పశువులను తోలినా కేసులు పెట్టి వేధించే అధికారులు.. వేలాది చెట్లు నేలమట్టమవుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ విధ్వంసానికి వారికి ఎవరి అనుమతి ఉంది?” అని కోటి సూటిగా ప్రశ్నించారు.

పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు అడవులే ఆదివాసీల జీవనాధారమని, వాటిని నాశనం చేయడం అంటే ఒక సంస్కృతిని, భవిష్యత్ తరాల మనుగడను దెబ్బతీయడమేనని నాయకులు హెచ్చరించారు.

చెట్ల నరికివేత వల్ల అటవీ జంతువుల ఆవాసాలు ధ్వంసమై, అవి జనావాసాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మద్దతుగా నిలిచిన అఖిలపక్షం ఈ అక్రమ నరికివేతను కాంగ్రెస్ నాయకులు గురిజాల గోపి, అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ కూడా తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే అక్రమార్కులకు కొమ్ముకాయడం సిగ్గుచేటని వారు విమర్శించారు. ఈ పోరాటంలో ఆదివాసీలకు అండగా ఉంటామని ప్రకటించారు.

*28న చలో మణుగూరు!*

అటవీ విధ్వంసానికి నిరసనగా ఆదివాసీ సంఘాలు పోరుబాట పట్టాయి. ఫిబ్రవరి 28న మణుగూరులోని ఎఫ్‌డీఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు అలేం కోటి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అన్ని ఆదివాసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే వరకు, అక్రమ ఇసుక తవ్వకాలను ఆపే వరకు విశ్రమించేది లేదని ఆదివాసీ నేతలు హెచ్చరించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో పనిచేసారు. ప్రస్తుతం నిజం న్యూస్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button