పెళ్లి పేరుతో ట్రాప్
యువతులనే లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు పక్కా ప్రణాళికలతో మోసాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.

*పెళ్లి మాటున మోసాలు…
యువతులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్ హెచ్చరిక*
హైదరాబాద్ నగరంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయని సజ్జనార్ హెచ్చరించారు.
ప్రస్తుతం యువతులనే లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు పక్కా ప్రణాళికలతో మోసాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.
ప్రేమ వివాహాలు కావొచ్చు, పెద్దలు కుదిర్చిన సంబంధాలు కావొచ్చు… పెళ్లి పీటలు ఎక్కే వరకు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పెళ్లి పేరుతో ట్రాప్…
మొదట సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, తర్వాత నిశ్చితార్థం జరిపించుకుని విశ్వాసం సంపాదిస్తారని సీపీ వివరించారు. “ఎలాగూ పెళ్లే కదా” అంటూ చనువు పెంచి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ శారీరకంగా లోబడేలా ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.
అనంతరం తమ అసలు రంగు బయటపెట్టి, భారీ మొత్తంలో డబ్బు లేదా అదనపు కట్నం డిమాండ్ చేస్తూ పెళ్లి రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు.
ఫిర్యాదులకు వెనుకడుగు వేయొద్దు
నిశ్చితార్థం జరిగిపోయి, బంధుమిత్రులందరికీ విషయం తెలిసిపోయిన తర్వాత పెళ్లి ఆగిపోతే పరువు పోతుందనే భయంతో చాలామంది ఫిర్యాదు చేయడంలో వెనుకడుగు వేస్తున్నారని సీపీ పేర్కొన్నారు.
ఇదే అదనుగా భావిస్తున్న మోసగాళ్లు మరింతగా వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. పరువు కోసం మౌనంగా ఉంటే జీవితాంతం నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
సంబంధం కుదిరిందని గుడ్డిగా నమ్మొద్దు
పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా సరే, అబ్బాయి ప్రవర్తన, అలవాట్లు, స్నేహితుల గురించి పూర్తిగా ఆరా తీయాలని సూచించారు.
పెళ్లికి ముందే ఏకాంతంగా కలవాలని, శారీరక సంబంధానికి ఒత్తిడి తెస్తే కచ్చితంగా అనుమానించాలన్నారు. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.
షీ టీమ్స్‌కు పెరుగుతున్న ఫిర్యాదులు
ఇటీవల పెళ్లి మోసాలపై Hyderabad She Teams కు ఫిర్యాదులు పెరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు లేదా అత్యవసర సేవల కోసం డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. యువతుల భద్రతే తమ ప్రాధాన్యత అని పోలీసులు స్పష్టం చేశారు.



