మూడు జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు…నిప్పుల కుంపటిలా మారిన తెలంగాణ
మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లిలో 40.2 డిగ్రీలు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో పెరుగుతున్న వేడి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

అప్పుడే మొదలైన వేసవి ప్రతాపం
తెలంగాణ రాష్ట్రంలో వేసవి కాలం తన ప్రతాపాన్ని అప్పుడే మొదలుపెట్టింది. మార్చి నెల మధ్యలోనే సూర్యుడు నిప్పులు చెరుగుతుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.
ముఖ్యంగా మూడు జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం, నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ ప్రాంతంలో అత్యధికంగా 40.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
దీనితో పాటు మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లిలో 40.2 డిగ్రీలు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో పెరుగుతున్న వేడి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
రాష్ట్రంలోని మిగిలిన 30 జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 37 నుండి 40 డిగ్రీల మధ్య కొనసాగుతున్నాయి.
జగిత్యాల జిల్లాలోని బీర్పూర్, ఆదిలాబాద్‌లోని జైనద్, ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39.9 డిగ్రీల వరకు చేరాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము ప్రాంతాల్లో కూడా వేడి గాలుల ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 38.8 డిగ్రీలు, హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సాధారణంగా ఏప్రిల్ నెలలో ఉండే ఈ వేడి ఈసారి మార్చిలోనే మొదలుకావడం వాతావరణ మార్పులకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు 2023 కంటే ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావడం కష్టతరంగా మారుతోంది.
వేడి గాలుల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు, పండ్ల రసాలు తీసుకోవడం అవసరమని వారు చెబుతున్నారు. అయితే, పెరుగుతున్న వేడి నుండి ఉపశమనం కలిగించేలా వాతావరణ కేంద్రం శుభవార్త వినిపించింది.
రాబోయే ఐదు నుండి ఏడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. దీనివల్ల ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది.
ఈ అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ బులెటిన్ పేర్కొంది.
ప్రస్తుతం వీస్తున్న వేడి గాలులు, మధ్యాహ్నపు ఎండల తీవ్రత చూస్తుంటే రాబోయే ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరే ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి ప్రజలు ఎండ నుండి తమను తాము కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.
(సి.హెచ్.ప్రతాప్)



