నానాటికీ పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు
నిర్మల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోను మండల పరిధిలోని పరిపాక గోదావరి కూచంపల్లి, స్వర్ణ వాగు పరివాహ ప్రాంతాల్లో ఉన్న వాగుల్లో నుంచి ఆలూరు వైపు నుండి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

గోదావరి నది పర్యావరణం దెబ్బతింటోంది
కూచంపల్లి గోదావరి పరిపాక ప్రాంతంలో అక్రమ ఇసుక డంపులు
ప్రభుత్వ ఖజానాకు గండి
నిర్మల్, ఫిబ్రవరి 19: (జిల్లా ప్రతినిధి నిజం చెపుతాం)
నిర్మల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోను మండల పరిధిలోని పరిపాక గోదావరి కూచంపల్లి, స్వర్ణ వాగు పరివాహ ప్రాంతాల్లో ఉన్న వాగుల్లో నుంచి ఆలూరు వైపు నుండి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ అక్రమ కార్యకలాపాలు నిర్భందం లేకుండా కొనసాగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
నాలుగు నుండి ఐదు ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజూ ఇసుకను నిర్మల్ పట్టణానికి తరలిస్తూ, గ్రామాల్లో మరియు శివారులో డంపులుగా నిల్వ చేస్తున్నారని తెలిపారు. ఈ విధంగా ప్రజల ఆస్తిని దోచుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ఆరోపించారు.
గోదావరి నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగడం వల్ల నది పరివాహ ప్రాంత పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని, భూగర్భ జలాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే అక్రమ ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్ స్పందించి, మండల రెవెన్యూ అధికారులకు నియమ నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.



