రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం… ముగ్గురు చిన్నారులకు ప్రాణ సంకటం
రైస్ మిల్లులలోని బాయిలర్ లలో ధాన్యాన్ని ఉడికించిన నీటిని పొట్టును కాల్చిన తర్వాత వచ్చే బూడిదను మిల్లర్లు పూర్తిగా చల్లబరచకుండా జనావాసాల మధ్య రహదారుల పక్కన పారబోస్తున్నారు.

నిబంధనలు గాలికి… బూడిద కళ్ళలోకి
సంపాదించుకుంటున్న మిల్లర్లు…ఇబ్బందులు పడుతున్న ప్రజలు…
హుజూర్నగర్ లో ఉన్న రైస్ మిల్లుల యాజమాన్యాల బాధ్యతారాహిత్యం సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది.
నిబంధనలకు విరుద్ధంగా రహదారుల పక్కన జనావాసాల మధ్య వేడి వేడి బూడిదను పోస్తుండటంతో తెలియని ప్రజలు, మూగ జీవులు వాటి మీద నుండి పోయి తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నాయి.
రైస్ మిల్లులలోని బాయిలర్ లలో ధాన్యాన్ని ఉడికించిన నీటిని పొట్టును కాల్చిన తర్వాత వచ్చే బూడిదను మిల్లర్లు పూర్తిగా చల్లబరచకుండా జనావాసాల మధ్య రహదారుల పక్కన పారబోస్తున్నారు.
తెలియక ఆ కుప్పలపై కాలు వేసిన పశువులు, ఆడుకునే పిల్లలు నిలువునా కాలిపోతున్నారు. రోడ్డు పక్కన పోతున్న వాహనదారుల కండ్లలో ఈ బూడిద పడి అనేకసార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి.

సోమవారం సాయంత్రం రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లలు రోడ్డు పక్కన పోసిన బూడిదను మామూలు బూడిద అనుకొని దానిపై కాలు వేయగా అది వేడిగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన సంఘటన హుజూర్ నగర్ లో జరిగింది.
హుజూర్నగర్ లోని ప్రధాన రహదారి ప్రక్కన ఆడుకుంటూ పోతున్న ముగ్గురు చిన్నారులు విశాల్ , నాగ యశ్వంత్, యశ్వంతులు రోడ్డు పక్కనే పడవేసి ఉన్న బూడిదపై కాలు వేయడంతో దానిలో ఉన్న నిప్పు కనికల వల్ల కాళ్లు, శరీరం చాలా వరకు కాలిపోయాయి.
వెంటనే ముగ్గురు చిన్నారులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రహదారుల పక్కనే ఇంకా చల్లారని వేడి బూడిదను నిర్లక్ష్యంగా పారబోస్తున్న మిల్లర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మిల్లర్లు రోడ్డుపక్కనే వేడి బూడిదను పారబోస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. రాత్రివేళల్లో చాటుచాటుగా బూడిదను తరలించి పడేస్తున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేసి, సంబంధిత మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు అతిక్రమించి రహదారుల పక్కన బూడిద పోస్తున్న మిల్లర్లపై కాలుష్య నియంత్రణ మండలి (PCB) మరియు రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులు వెంటనే స్పందించి ఈ మృత్యు కుప్పల నుండి ప్రజలను కాపాడాలని స్థానిక ప్రజలు మరియు స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.



