హుజూర్ నగర్ MPDO కార్యాలయంలో జాతీయ జెండా దిమ్మె ధ్వంసం

*గేటు లేని కంచె.. గాలికి వదిలేసిన భద్రత*..!

 

*జాతీయ జెండా దిమ్మె ధ్వంసం.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం*..!

 

*గేటు లేని ఆవరణ.. అసాంఘిక కార్యకలాపాలకు అక్రమ పార్కింగ్‌లకు అడ్డాగా మారుతోందా*..?

 

హుజూర్ నగర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. నిత్యం వందలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్లే ఈ ప్రభుత్వ కార్యాలయంలో దేశ గౌరవానికి చిహ్నమైన జాతీయ జెండా దిమ్మెను గుర్తుతెలియని ఆగంతుకులు ధ్వంసం చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ జెండాను ఎగురవేసే పవిత్రమైన దిమ్మెను కూల్చివేసినా అధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

*గేటు లేని కంచె.. గాలికి వదిలేసిన భద్రత*..!

 

మండల స్థాయిలోనే అత్యంత కీలకమైన ఈ కార్యాలయానికి కనీసం ఒక ప్రవేశ ద్వారం (గేటు) లేకపోవడం గమనార్హం. అధికారులు కార్యాలయానికి వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఆవరణలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో గేటు లేకపోవడంతో ఈ ప్రాంతం అరాచక శక్తులకు నిలయంగా మారుతోందని, అందుకే ధైర్యంగా జెండా దిమ్మెను ధ్వంసం చేసే వరకు వెళ్లారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

*అక్రమ పార్కింగ్ అడ్డాగా ప్రభుత్వ స్థలం*..?

 

కార్యాలయ ఆవరణను కొందరు వ్యక్తులు తమ సొంత ఆస్తిలా వాడుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలు, కార్లను ఇక్కడ పార్కింగ్ చేస్తూ ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ పార్కింగ్ జోన్‌గా మార్చేశారు. దీనివల్ల పనివేళల్లో కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల కళ్లముందే ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

*చర్యలు తీసుకునేది ఎప్పుడు*…?

 

జాతీయ చిహ్నాన్ని అవమానించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కార్యాలయానికి గేటు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఈ సమస్యను పరిష్కరిస్తారా? లేక ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button