బస్సులో మంటలు.. ప్రయాణికులందరూ సురక్షితం….చెప్పుల కోసం బస్సులోకి వెళ్లిన మహిళ చర్యపై ఆశ్చర్యం
రావులపాలెం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్‌కు చెందిన బస్సు బస్టాండ్ సమీపానికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు

విజయవాడలో మంగళవారం తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది.
రావులపాలెం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్‌కు చెందిన బస్సు బస్టాండ్ సమీపానికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు.
మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ మరియు సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రాథమికంగా బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం.
ఈ ఘటనలో ఒక విచిత్రమైన విషయం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బస్సు మంటల్లో కాలి పోతున్న సమయంలో, ఓ మహిళ తన చెప్పులు బస్సులో మర్చిపోయానని గుర్తించి మళ్లీ లోపలికి వెళ్లి వాటిని తీసుకువచ్చింది. అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.
ఇటీవలి కాలంలో బస్సు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రాణ భద్రత కంటే వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక బస్సు ప్రమాదంలో అగ్ని ప్రమాదం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి,
ఇది రోడ్డు భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తోంది.



