సుఖ ప్రసవాలకు కేరాఫ్ అడ్రస్… మఠంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ..!

జిల్లా కలెక్టర్ చొరవతో పీహెచ్‌సీలో రూ. 5 లక్షల విలువైన కొత్త వైద్య పరికరాలు..!

మఠంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గర్భిణీ స్త్రీలకు వరప్రదాయినిగా మారుతోంది. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆధ్వర్యంలో సుఖ ప్రసవాలు విజయవంతంగా జరుగుతున్నాయని ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణి తెలిపారు. ఆదివారం మఠంపల్లి మండలం చెన్నయ్యపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళకు వైద్యులు విజయవంతంగా నార్మల్ డెలివరీ చేశారు.

అధునాతన సౌకర్యాలు – కలెక్టర్ ప్రత్యేక చొరవ..!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డాక్టర్ కళ్యాణి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సుమారు 5 లక్షల రూపాయల విలువైన అధునాతన వైద్య సామాగ్రిని మఠంపల్లి పీహెచ్‌సీకి మంజూరు చేశారని, ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు.

నార్మల్ డెలివరీతోనే ఆరోగ్యం.. ఆదా..!

గతంలో కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నెలకు 20 నుండి 30 వరకు నార్మల్ డెలివరీలు చేసిన అనుభవం తమ సిబ్బందికి ఉందని డాక్టర్ గుర్తు చేశారు. ప్రస్తుతం బయట ప్రైవేట్ ఆసుపత్రులలో ఒక్క ప్రసవానికి రూ. 1,50,000 నుండి రూ. 1,80,000 వరకు ఖర్చవుతోందని, అంత భారాన్ని మోయడం మధ్యతరగతి మరియు పేద ప్రజలకు సాధ్యం కాదని ఆమె అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందుతోంది. గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా, ప్రభుత్వ సేవలపై నమ్మకంతో ఇక్కడే ప్రసవాలు చేయించుకోవాలి.”

డాక్టర్ కళ్యాణి, ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్ మఠంపల్లి

ప్రభుత్వం కూడా నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తూ అన్ని రకాల మందులు, టీకాలు మరియు పౌష్టికాహారాన్ని అందిస్తోందని, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button