డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పారదర్శకంగా జీతాలు.. 100 రోజుల్లో సమగ్ర కార్యాచరణకు ఆదేశాలు

హైదరాబాద్ | జూలై 7, 2026 | నిజం న్యూస్

రాష్ట్ర పరిపాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రభుత్వ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌ను సమర్థవంతంగా అమలు చేసేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన మేరకు చట్టాలను రూపొందించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా అర్హుల ఖాతాల్లోకి చేరే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన లేదా గరిష్టంగా 5వ తేదీలోగా జీతాలు అందేలా అన్ని వివరాలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, జీతభత్యాలు, బ్యాంక్ ఖాతాల సమాచారం, సేవా వివరాలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. దీంతో ఉద్యోగుల జీతాల చెల్లింపులో జాప్యం, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 4,800 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, అందులో దాదాపు 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించడం లేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనప్పటికీ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి, ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ అమలుతో ఇలాంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.

ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా పూర్తిగా డిజిటలైజ్ చేసి, హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను సులభంగా అమలు చేసే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. డిజిటల్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎంఏ&యూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్మన్ శాంతి కుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button