యువతను క్రీడల వైపు మళ్ళించాలి
రాష్ట్ర ఆదాయ వ్యయ పట్టికలో క్రీడలకు కేటాయించే నిధులు కేవలం ఖర్చుగా భావించకూడదు. భవిష్యత్తు తరాల ఆరోగ్యం రాష్ట్ర గౌరవం కోసం చేసే అత్యుత్తమ పెట్టుబడిగా ప్రభుత్వం గుర్తించాలి.

క్రీడారంగానికి ప్రత్యేక కేటాయింపులు అవసరం
తెలంగాణ రాష్ట్రం క్రీడారంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తోంది.
గత దశాబ్ద కాలంలో అనేక మంది క్రీడాకారులు విశ్వక్రీడలు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి రాష్ట్ర ప్రతిష్టను గగనమంత ఎత్తుకు పెంచారు.
విజయాల పరంపరను నిరంతరం కొనసాగించాలన్నా మారుమూల గ్రామాల్లో నిద్రాణమై ఉన్న ప్రతిభను వెలికితీయాలన్నా క్రీడారంగానికి తగిన ఆదాయ వ్యయ పట్టికలో కేటాయింపులు చేయడం ఎంతో ఆవశ్యకం.
రాష్ట్ర ఆదాయ వ్యయ పట్టికలో క్రీడలకు కేటాయించే నిధులు కేవలం ఖర్చుగా భావించకూడదు. భవిష్యత్తు తరాల ఆరోగ్యం రాష్ట్ర గౌరవం కోసం చేసే అత్యుత్తమ పెట్టుబడిగా ప్రభుత్వం గుర్తించాలి.
సరైన ఆర్థిక కేటాయింపుల ద్వారా మాత్రమే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను నిర్మించడం సాధ్యమవుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు సరైన మైదానాలు పరికరాలు ఆధునిక శిక్షణ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ కేటాయింపుల్లో క్రీడలకు పెద్దపీట వేయడం ద్వారా ప్రతి మండల కేంద్రంలోనూ బహుళార్థసాధక అంతర్గత క్రీడా ప్రాంగణాలు కృత్రిమ పరుగు పందెం దారులు నిర్మించవచ్చు.
క్రీడాకారులకు అవసరమైన పౌష్టికాహారం అందించడం వారి ప్రయాణ ఖర్చులను భరించడం ఆధునిక శిక్షణా సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలకు నిధులు అత్యవసరం.
కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రతిభను గుర్తించేందుకు ప్రతిభా అన్వేషణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సి ఉంది.
దీనివల్ల మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చే క్రీడాకారులకు గొప్ప ఆర్థిక భరోసా లభిస్తుంది.
క్రీడల కోసం కేటాయించే నిధులు కేవలం భారీ క్రీడా ప్రాంగణాల నిర్మాణానికే పరిమితం కాకూడదు.
పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ఒక తప్పనిసరి అంశంగా మార్చడానికి వ్యాయామ ఉపాధ్యాయుల నియామకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
క్రీడా పాఠశాలలను మరింత బలోపేతం చేయడం ద్వారా చిన్న వయస్సు నుంచే విజేతలను తయారు చేయవచ్చు.
అలాగే గాయపడిన క్రీడాకారులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి ప్రత్యేక క్రీడా వైద్య విభాగాలను ఏర్పాటు చేయడం వల్ల వారి క్రీడా జీవితం అర్ధాంతరంగా ముగియకుండా చూడవచ్చు.
క్రీడల్లో రాణించే వారికి నగదు ప్రోత్సాహకాలు ఉద్యోగ అవకాశాల కల్పనలో స్పష్టమైన విధానం ఉండాలి. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూడాలి.
అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు తెలంగాణ వేదికగా మారితే అది పర్యాటక రంగానికి కూడా గొప్ప ఊతమిస్తుంది.
అంతర్జాతీయ పెట్టుబడిదారుల మాదిరిగానే క్రీడా రంగంలోనూ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక పారిశ్రామిక విధానం అవసరం.
ఆదాయ వ్యయ పట్టికలో క్రీడా పరిశ్రమల స్థాపనకు రాయితీలు ప్రకటించడం ద్వారా క్రీడా పరికరాల తయారీ కేంద్రాలు తెలంగాణలో విస్తరిస్తాయి.
దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా క్రీడాకారులకు తక్కువ ధరకే నాణ్యమైన పరికరాలు అందుబాటులోకి వస్తాయి.
క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా యువతలో క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు ఐక్యతను పెంపొందించడానికి తోడ్పడతాయి.
మాదకద్రవ్యాలు ఇతర వ్యసనాల వైపు యువత మళ్లకుండా ఉండాలంటే వారిని క్రీడల వైపు మళ్లించడం ఒక సామాజిక బాధ్యత.
అందువల్ల ప్రభుత్వం రాబోయే ఆదాయ వ్యయ పట్టికలో క్రీడా రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచాలి.
ఒక బలమైన క్రీడా సంస్కృతిని నిర్మించడం ద్వారా తెలంగాణను క్రీడల రాజధానిగా మార్చడం సాధ్యమవుతుంది. క్రీడాకారులకు లభించే ప్రతి రూపాయి భవిష్యత్తులో దేశానికి పతకాల రూపంలో తిరిగి వస్తుంది.
ప్రభుత్వం ఈ దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని క్రీడాకారుల కలలకు రెక్కలు తొడగాలి. ఇది కేవలం క్రీడాకారుల విజయం మాత్రమే కాదు యావత్ తెలంగాణ సమాజపు ప్రగతికి నిదర్శనం.
గతంలో కేవలం కొన్ని ఆటలకే పరిమితమైన ఆదరణ ఇప్పుడు అన్ని రకాల క్రీడలకు విస్తరించాలి. ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు ప్రత్యేక వసతులు భద్రత కల్పించేందుకు ప్రత్యేక నిధులు అవసరం. గ్రామీణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను క్రీడా మైదానాలుగా మార్చడం వల్ల యువత సృజనాత్మకత మెరుగుపడుతుంది.
క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి విదేశీ శిక్షకులను రప్పించడం లేదా మన శిక్షకులను విదేశాలకు పంపడం వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం వెచ్చించే ప్రతి పైసా సార్థకమవుతుంది.
జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా స్థానిక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. క్రీడా రంగం కేవలం వినోదం మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన ఉపాధి మార్గం కూడా. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలి. తల్లిదండ్రులకు కూడా క్రీడల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి.
క్రీడాకారులకు ఇచ్చే ఉపకార వేతనాలు వారి దైనందిన అవసరాలకు సరిపోయేలా ఉండాలి. పతకాలు సాధించిన వారికి ఇచ్చే పురస్కారాలు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలి.
తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో స్వర్ణయుగాన్ని చూడాలంటే పటిష్టమైన ఆర్థిక ప్రణాళికే పునాది. క్రీడల వల్ల సామాజిక సంబంధాలు బలపడతాయి. వివిధ ప్రాంతాల క్రీడాకారులు ఒకచోట చేరడం వల్ల ప్రాంతీయ బేధాలు తొలిగిపోతాయి.
క్రీడాకారుల ఆత్మవిశ్వాసం పెంచేందుకు మానసిక నిపుణుల సేవలను కూడా అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడా అకాడమీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుంది.
ప్రచార మాధ్యమాలు కూడా క్రీడలకు ప్రాముఖ్యతనివ్వాలి. అప్పుడే క్రీడారంగం సమాజంలో ఒక అంతర్భాగంగా మారుతుంది. పల్లెటూళ్లలో కబడ్డీ ఖోఖో వంటి దేశీయ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతిని కాపాడుకోవచ్చు.
క్రీడా ప్రస్థానంలో నిరంతర కృషి ఆర్థిక సహాయం తోడైతే తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ వేదికలపై గెలుపు జెండాను ఎగురవేయడం తథ్యం.
(సి.హెచ్. ప్రతాప్)
మొబైల్ నెంబర్: 98808 51898



