కురవి శ్రీ వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ పదవి ఈసారైనా దళితులకు దక్కేనా…!

ఈసారైనా మార్పు వస్తుందా?

 

ఏళ్ల తరబడి ఒకే వర్గాలకే ఆలయ చైర్మన్ పదవి.

 

ఎస్‌సి వర్గంలో ఆశలు, రాజకీయాల్లో చర్చలు..

 

మహబూబాబాద్ జిల్లా, కురవి (నిజం చెపుతాం), ఫిబ్రవరి 18 :

 

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కురవి శ్రీ వీరభద్రస్వామి ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ పదవి ఈసారి ఎవరిని వరించనుందన్న అంశం రాజకీయ,సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా ఎస్‌సి (దళిత) వర్గానికి ఈసారి అవకాశం కల్పించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

 

చరిత్రలో దళితులకు దక్కని పీఠం.

 

1964కు ముందు రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి అనంతరం పాలక మండలి ఏర్పడింది.అప్పటి నుంచి ధర్మకర్తలుగా, చైర్మన్‌లుగా రాజుల వంశం, ఓసి, బిసి, ఎస్టి వర్గాలకు చెందిన వ్యక్తులకే అవకాశాలు లభించాయి. వద్దుల బుచ్చిరెడ్డి, వెంకట్రాం రెడ్డి, అల్లూరి వెంకట్రామరాజు (రెండు దఫాలు), సూరల రాజేందర్ రెడ్డి, వద్దుల జోగారెడ్డి, నూతక్కి ప్రసాదరావు, వద్దుల శ్రీనివాస్ రెడ్డి, కొప్పుల వెంకట్ రెడ్డి, బండి లక్ష్మారెడ్డి, మేక దామోదర్ రెడ్డి, సోంశెట్టి శ్రీనివాస్, రాజునాయకీ (మూడు దఫాలు), రామునాయక్, కోర్ని రవీందర్ రెడ్డి తదితరులు ఈ పదవిని చేపట్టారు. అయితే దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికి కూడా ఇప్పటివరకు ఈ ధర్మపీఠం దక్కకపోవడం గమనార్హం.

 

ప్రస్తుత చైర్మన్ పదవీ కాలం ముగింపు దశలో..,

 

ప్రస్తుతం ఆలయ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న కోర్ని రవీందర్ రెడ్డి పదవీకాలం 2026 మహాశివరాత్రి అనంతరం ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్ ఎంపికపై ఆసక్తి నెలకొంది.

 

పదవీ కోసం పైరవీలు..,

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఓసి వర్గానికి చెందిన వ్యక్తికి చైర్మన్ పదవి కట్టబెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ నియామకం సమీపిస్తుండడంతో ఆశావాహులు పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నియామకాన్ని రాజకీయ ఎత్తుగడగా చూస్తున్నారు. అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

 

ఈసారైనా దళితులకు అవకాశం?

 

బీఆర్ఎస్ హయాంలో అన్నిరంగాల్లో దళితులకు పెద్దపీట వేసినా, ఈ ఆలయ చైర్మన్ పదవిలో మాత్రం ఎస్‌సి వర్గానికి అవకాశం కల్పించలేదన్న విమర్శ ఉంది. గత ఎమ్మెల్యే పాలనలో కూడా దళితులకు ఈ పదవి దక్కలేదు. ఇప్పుడు గిరిజన వర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే ఈసారి దళితులను ధర్మపీఠంపై ఎక్కిస్తారా? లేక మళ్లీ ఒకే వర్గాలకు పరిమితం చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

సామాజిక న్యాయం వైపు అడుగు పడుతుందా?

 

ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఎస్‌సి వర్గం ఈసారి ధర్మపీఠం తమకు దక్కుతుందన్న ఆశతో ఉంది. సామాజిక సమానత్వం, న్యాయం దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? లేక గత పద్ధతినే కొనసాగిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. దళితుల ధర్మపీఠ ఆశలు నెరవేరుతాయా? లేక మళ్లీ నిరాశేనా? కురవి రాజకీయాల్లో ఈ ప్రశ్నకు సమాధానం త్వరలోనే వెలుగులోకి రానుంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button