గోప్యతా నిబంధనలకు త్రిలోదకాలిస్తున్న వాట్సాప్

గత కొంతకాలంగా వాట్సాప్ అనుసరిస్తున్న కొత్త గోప్యతా విధానాలు వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి.

ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచార మార్పిడికి అత్యంత ప్రజాదరణ పొందిన వేదిక వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తమ వ్యక్తిగత సంభాషణల కోసం ఈ యాప్‌పై ఆధారపడుతున్నారు.

అయితే గత కొంతకాలంగా వాట్సాప్ అనుసరిస్తున్న కొత్త గోప్యతా విధానాలు వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి.

వాట్సాప్ తన మాతృ సంస్థ అయిన మెటాతో వినియోగదారుల డేటాను పంచుకోవాలని నిర్ణయించుకోవడం గోప్యతకు త్రిలోదకాలివ్వడమేనని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.

ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సందేశాలు సురక్షితంగా ఉంటాయని సంస్థ చెబుతున్నప్పటికీ ఇతర రూపాల్లో డేటా సేకరణ నిరంతరాయంగా జరుగుతోంది.

ఈ డేటా సేకరణ అనేది వినియోగదారుడికి తెలియకుండానే వారి డిజిటల్ అడుగుజాడలను రికార్డు చేస్తోంది.

వాట్సాప్ సేకరించే సమాచారంలో వినియోగదారుల ఫోన్ నంబర్లు లావాదేవీల డేటా సేవా సంబంధిత సమాచారం మరియు ఐపీ అడ్రస్ వంటివి ప్రధానమైనవి.

ఈ సమాచారాన్ని ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర మెటా ప్లాట్‌ఫామ్‌లతో పంచుకోవడం ద్వారా వినియోగదారుల ప్రవర్తనను అంచనా వేయడం సులభమవుతుంది. దీనివల్ల ప్రకటనల వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనేది సంస్థ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

వినియోగదారులు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు ఎంత సమయం యాప్‌లో గడుపుతున్నారు మరియు ఏయే గ్రూపులలో యాక్టివ్‌గా ఉన్నారు వంటి మెటాడేటా విశ్లేషణ ద్వారా ఒక వ్యక్తి యొక్క పూర్తి ముఖచిత్రాన్ని సంస్థలు నిర్మించగలవు.

ఇది ఒక రకంగా వ్యక్తిగత స్వేచ్ఛపై నిఘా ఉంచడమే అవుతుంది. మనం పంపే సందేశాలు చదవకపోయినా మనం ఎవరితో ఎప్పుడు సంభాషిస్తున్నామనే సమాచారం వారి వద్ద ఉండటం ప్రమాదకరం.

 

ప్రభుత్వాలు మరియు నియంత్రణ సంస్థలు వాట్సాప్ చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. భారతదేశం వంటి దేశాల్లో గోప్యతా నిబంధనల ఉల్లంఘనపై న్యాయపరమైన పోరాటాలు కూడా సాగుతున్నాయి. వినియోగదారులకు తమ డేటాపై నియంత్రణ ఉండాలని సంస్థలు బలవంతంగా నిబంధనలను రుద్దకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ తన కొత్త నిబంధనలను అంగీకరించని పక్షంలో సేవలను నిలిపివేస్తామని గతంలో చేసిన హెచ్చరికలు వినియోగదారులను ఆందోళనకు గురిచేశాయి. ఈ ఒత్తిడి కారణంగానే చాలా మంది పౌరులు సిగ్నల్ మరియు టెలిగ్రామ్ వంటి ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.

గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని భావించే వారికి వాట్సాప్ వైఖరి ఆమోదయోగ్యంగా లేదు. టెక్ దిగ్గజాలు తమ గుత్తాధిపత్యాన్ని ఉపయోగించి నిబంధనలను మార్చడం ప్రజాస్వామ్య విలువులకు విరుద్ధం.

 

సాంకేతికపరంగా చూస్తే వాట్సాప్ బిజినెస్ ఖాతాల ద్వారా జరిగే సంభాషణలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వ్యాపార సంస్థలతో మనం జరిపే సంభాషణలు థర్డ్ పార్టీ సర్వర్లలో నిక్షిప్తమయ్యే అవకాశం ఉండటం వల్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

వాణిజ్య ప్రకటనల కోసం మన ఇష్టాయిష్టాలను విశ్లేషించడం వల్ల వినియోగదారులు నిరంతరం ప్రకటనల వెల్లువలో చిక్కుకుపోతున్నారు. డేటానే ఇంధనంగా మారుతున్న ఈ కాలంలో వాట్సాప్ వంటి దిగ్గజ సంస్థలు లాభాల కోసం వినియోగదారుల గోప్యతను పణంగా పెట్టడం ఆందోళనకరం. పారదర్శకత లేని నిబంధనలు సంస్థపై ఉన్న నమ్మకాన్ని సడలిస్తున్నాయి.

యూజర్ల ప్రైవసీ కంటే వ్యాపార ప్రయోజనాలకే పెద్దపీట వేయడం వల్ల సామాన్యుడి సమాచారం అంగడి సరుకుగా మారుతోంది.

 

డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉన్న సమాజంలో ఇటువంటి నిబంధనల వల్ల కలిగే నష్టాలను గుర్తించడం సామాన్యులకు కష్టమవుతుంది. కేవలం ఉచిత సేవలు అందిస్తున్నారనే కారణంతో వ్యక్తిగత భద్రతను వదులుకోవడం సరైనది కాదు. భవిష్యత్తులో డేటా రక్షణ చట్టాలు మరింత పటిష్టం కావలసిన అవసరం ఉంది.

వాట్సాప్ తన పంథాను మార్చుకోకపోతే వినియోగదారులు క్రమంగా విశ్వసనీయత కలిగిన ఇతర వేదికల వైపు వెళ్ళడం ఖాయం. వ్యక్తిగత గోప్యత మరియు సంస్థాగత లాభాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు అది వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకే దారితీస్తుంది. టెక్నాలజీ అనేది మనిషి అవసరాల కోసం ఉండాలి తప్ప మనిషిని ఒక వస్తువుగా మార్చకూడదు.

ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ డేటా భద్రతను కాపాడుకోవాలి. కేవలం అప్లికేషన్లను వాడటమే కాకుండా వాటి వెనుక ఉన్న నిబంధనలను అర్థం చేసుకోవడం నేటి అవసరం.

సి.హెచ్.ప్రతాప్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button