హల్క్ బొమ్మ మింగిన చిన్నారి.. ఎక్స్‌రేలో కనిపించడంతో డాక్టర్ల షాక్
అహ్మదాబాద్‌లో ఆడుకుంటూ హల్క్ టాయ్ మింగిన ఏడాదిన్నర చిన్నారి ఒక్కసారిగా మాట రాక కుప్పకూలడంతో కుటుంబం ఆందోళన చెందగా, ఎక్స్‌రే పరీక్షలో నిజం బయటపడటంతో వైద్యులు అత్యవసర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.

సూపర్ హీరోలంటే పిల్లలకు ఎంత ఇష్టం ఉంటుందో అందరికీ తెలుసు. అదే ఇష్టం ఇప్పుడు ఓ కుటుంబాన్ని భయాందోళనకు గురి చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటన చిన్నారుల భద్రతపై మరోసారి ఆలోచింపజేస్తోంది.
ఏడాదిన్నర వయసున్న వంశ్ ఇంట్లో హల్క్ బొమ్మతో ఆడుకుంటున్నాడు. కొద్ది సేపట్లోనే ఒక్కసారిగా మాట ఆగిపోయింది. ఏమైందో అర్థం కాక ముందే నేలపై కుప్పకూలడంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఎక్స్‌రేలో అసలు విషయం
డాక్టర్లు మొదట సాధారణ పరీక్షలు చేశారు. కానీ పరిస్థితి స్పష్టంగా కనిపించకపోవడంతో ఎక్స్‌రే, స్కాన్లు చేశారు. అప్పుడు గొంతు లోపల ఒక చిన్న వస్తువు కనిపించడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఆ వస్తువు హల్క్ టాయ్ అని గుర్తించారు.
ఎండోస్కోపీ ద్వారా బొమ్మను బయటకు తీయడానికి ప్రయత్నించారు. అయితే గొంతు భాగం చాలా సున్నితంగా ఉండటంతో ప్రతి క్షణం సవాల్‌గా మారింది. పరికరాలు జారిపోవడం, బొమ్మ కదలడం వల్ల డాక్టర్లు గంటలపాటు శ్రమించారు. చివరకు జాగ్రత్తగా టాయ్‌ను బయటకు తీసి చిన్నారి ప్రాణాలను కాపాడారు.
డాక్టర్ల హెచ్చరిక
ఈ ఘటనతో కుటుంబం ఊపిరి పీల్చుకుంది. అయితే వైద్యులు మాత్రం తల్లిదండ్రులకు గట్టి సూచనలు చేశారు. చిన్న సైజ్ బొమ్మలు, విడిపోయే భాగాలున్న టాయ్స్ పిల్లలకు ఇవ్వకూడదని, ఎప్పుడూ పర్యవేక్షణలోనే ఆడించాలన్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని కూడా తెలిపారు.
చిన్నారి చిరునవ్వు మళ్లీ కనిపించడంతో కుటుంబ సభ్యులందరూ ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఈ సంఘటన ప్రతి తల్లిదండ్రికి ఒక హెచ్చరికగా మారింది.



