Telangana : నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 పబ్లిక్ స్కూల్స్.. తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం

Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వంద పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్ర విద్యా రంగంలో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతుంది

Telangana :  కొత్తగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ స్థాపన 

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వంద పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్ర విద్యా రంగంలో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతుంది.

ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల పట్ల సామాన్య ప్రజల్లో ఉన్న పాత దృక్పథం పూర్తిగా మారిపోనుంది. సాధారణంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక నాణ్యమైన విద్యకు దూరమవుతుంటారు.

ఈ పబ్లిక్ స్కూళ్లు అటువంటి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందజేస్తాయి. దీనివల్ల సమాజంలో విద్యాపరమైన అసమానతలు తొలగిపోయి అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి.

 

ఈ పాఠశాలల స్థాపన వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం మౌలిక సదుపాయాల కల్పన. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యాధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు అభ్యసన ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా మారుతుంది.

కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ప్రయోగాత్మక విద్యను అందించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది.

ప్రతి నియోజకవర్గంలో ఒక ఆదర్శ పాఠశాల ఉండటం వల్ల ఆ ప్రాంతంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలు కూడా తమ ప్రమాణాలను పెంచుకోవడానికి పోటీ పడతాయి. ఇది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాల పెరుగుదలకు దోహదపడుతుంది.

 

మరో ముఖ్యమైన అంశం సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో భాగం చేయడం. కృత్రిమ మేధ వంటి ఆధునిక కోర్సులను పాఠశాల స్థాయి నుంచే ప్రవేశపెట్టడం వల్ల తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకోగలరు.

భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే రంగాలపై అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు చిన్నతనం నుంచే ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఉపాధ్యాయులకు ఇచ్చే ప్రత్యేక శిక్షణ ద్వారా బోధనా పద్ధతుల్లో నూతనత్వం వస్తుంది.

డిజిటల్ బోర్డులు, ఆన్‌లైన్ లెర్నింగ్ సామాగ్రి వినియోగం వల్ల సంక్లిష్టమైన పాఠాలను కూడా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.

 

విద్యార్థుల ఆరోగ్యం మీద ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ అభినందనీయం. ఉదయం పోషకాహారంతో కూడిన అల్పాహారం అలాగే పాలు అందించడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. పేద విద్యార్థులు ఆకలితో పాఠశాలకు రావడం వల్ల చదువుపై దృష్టి పెట్టలేరు.

ఈ పథకం ద్వారా వారి శారీరక దృఢత్వం మెరుగుపడి విద్యా ఫలితాలు మెరుగవుతాయి. అలాగే విద్యార్థులకు కావలసిన అన్ని రకాల స్టేషనరీ సామగ్రితో కూడిన కిట్లు అందించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుంది.

ఇది పాఠశాలల నుంచి విద్యార్థులు మధ్యలో మానేసే (డ్రాపౌట్స్) శాతాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

 

రవాణా సౌకర్యాల కల్పన వల్ల మారుమూల గ్రామాల విద్యార్థులు కూడా పట్టణాల్లో ఉండే ఈ నాణ్యమైన పాఠశాలలకు సులభంగా చేరుకోగలరు.

సురక్షితమైన ప్రయాణం అందుబాటులో ఉండటం వల్ల ఆడపిల్లల విద్యాశాతం కూడా పెరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తాయి.

ప్రభుత్వ పాఠశాలలే కార్పొరేట్ స్థాయి విద్యను అందించినప్పుడు సహజంగానే ప్రజలు ప్రభుత్వ విద్యా సంస్థల వైపు మొగ్గు చూపుతారు. ఇది విద్యా వ్యాపారీకరణను అరికట్టడానికి ఒక అద్భుతమైన మార్గం.

 

ప్రభుత్వం నిర్మిస్తున్నవి కేవలం భవనాలు కావు భవిష్యత్తు తరాల జీవితాలు, ప్రభుత్వ బడి అంటే పేదవాడి నమ్మకంగా మారాలి, ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

విద్యా రంగంలో ప్రభుత్వం తెస్తున్న ఈ మార్పు తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాది వేస్తుంది.”

 

వంద పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఇది రాష్ట్రంలోని మొత్తం విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీలో ఈ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయి.

దీనివల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ విద్యావంతులున్న రాష్ట్రంగా గుర్తింపు పొందుతుంది.

 

(సి.హెచ్.ప్రతాప్)

మొబైల్ నెంబర్: 98808 51898

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button