అభివృద్ధి పేరుతో మట్టి దందా…పర్యావరణాన్ని రక్షించాలి
మట్టి తవ్వకాలలో చిన్న అధికారుల నుంచి పెద్ద అధికారుల వరకు ప్రమేయం ఉందని, ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు మరియు ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.

సింగరేణి మార్చి 26(నిజం న్యూస్):అభివృద్ధి పేరుతో జరుగుతున్న మట్టి దందాను తక్షణమే నిలిపివేయాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ సబ్ డివిజన్ కార్యదర్శి భూక్య శివ నాయక్ డిమాండ్ చేశారు.
పర్యావరణాన్ని రక్షించాల్సిన అటవీ కొండలను అభివృద్ధి పేరుతో మట్టి మాఫియాకు అప్పగించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా వారు ఖండించారు.
ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఉన్న గుట్ట కింద గుంపు కొండను పెద్ద కాంట్రాక్టర్లు తవ్వకాల ద్వారా రోజుకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
మట్టి తవ్వకాలలో చిన్న అధికారుల నుంచి పెద్ద అధికారుల వరకు ప్రమేయం ఉందని, ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు మరియు ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.
పర్యావరణానికి ముప్పు కలిగించే అభివృద్ధి మాకు అవసరం లేదని, భావితరాలకు ఉపయోగపడే కొండలు మన కళ్లముందే నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మట్టి దందాను పూర్తిగా నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
లేని పక్షంలో సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించడంతో పాటు దశలవారీగా కొండపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.



