SINGARENI : ఖనిజ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యం
SINGARENI : సోలార్ విద్యుత్తు, బ్యాటరీలతో నడిచే వాహనాలు, ఎలక్ట్రానిక్ రంగ విస్తరణ లో, రక్షణ రంగంలో కీలక ఖనిజాల అవసరం ఎంతో ఉందని, దేశంలో కీలక ఖనిజాల వనరులు ఉన్నప్పటికీ, వాటి మైనింగ్ జరగటం లేదని కాబట్టి ప్రస్తుతం విదేశాల నుండి కీలక ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నామని కమిటీ అభిప్రాయపడింది.

ప్రభుత్వ,ప్రైవేటు ఖనిజ పరిశ్రమలు కలిసి పనిచేస్తే కీలక ఖనిజ రంగంలో మనదే అగ్రస్థానం
కీలక ఖనిజ రంగ అభివృద్ధికి తన వంతుగా..సింగరేణి కృషి
రామగుండం ఫిబ్రవరి 27, (నిజం న్యూస్)
హైదరాబాద్ లో నీతి ఆయోగ్ కీలక ఖనిజ కమిటీ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలు, నేటి ఆధునిక ప్రపంచంలో కీలక ఖనిజాలకు అధిక ప్రాధాన్యత ఉందని, కీలక ఖనిజ రంగంలో భారత్ ను స్వయం సమృద్ధి దేశంగా రూపుదిద్దడానికి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కమిటీ అభిప్రాయపడింది.
హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం (ఫిబ్రవరి 26) కమిటీ ఛైర్మన్ డాక్టర్ డీకే. సింగ్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో భారతదేశంలో కీలక ఖనిజాల ఆవశ్యకత, లభ్యత,కీలక ఖనిజాల అన్వేషణ,అందుకు గల అవకాశాలు, వివిధ ప్రభుత్వ మైనింగ్ సంస్థలు తీసుకోవలసిన చొరవ, బాధ్యతలు తదితర అంశాల పైన లోతుగా చర్చించారు.
కమిటీ మెంబర్ సెక్రటరీ,నీతి ఆయోగ్,డిప్యూటీ అడ్వైజర్ మినరల్స్ ఆర్.శరవణభవన్, సభ్యులుగా ఉన్న సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, ఇంకా ఇతర సభ్యులు పాల్గొన్నారు.
కేంద్ర నీతి ఆయోగ్ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సింగరేణి సంస్థ ఛైర్మన్ కూడా సభ్యులుగా ఉన్నారు.
కనుక ఈసారి ఈ సమావేశాన్ని సింగరేణి ఆతిథ్యంలో నిర్వహించడం జరిగింది. సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి సమావేశానికి స్వాగతం పలుకుతూ దేశంలో గల ప్రాథమిక మరియు ద్వితీయ కీలక ఖనిజ వనరులను కనుగొనడానికి ఏర్పాటు చేసిన ఈ కమిటీ దేశ కీలక ఖనిజ అవసరాలు తీర్చడంలో తమ వంతు కృషి చేస్తుందని దీనికి సింగరేణి సంస్థ తన సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ మట్టిలో, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫ్లై యాష్, బాటమ్ యాష్ లలో దాగి ఉన్న క్రిటికల్ మినరల్స్ ను వెలికితీయడానికి తమ వంతు కృషి చేస్తామని,జాతీయ కీలక ఖనిజ అవసరాలు తీర్చడంలో సింగరేణి సంస్థ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా.. సభ్యులు మాట్లాడుతూ, సోలార్ విద్యుత్తు, బ్యాటరీలతో నడిచే వాహనాలు, ఎలక్ట్రానిక్ రంగ విస్తరణ లో, రక్షణ రంగంలో కీలక ఖనిజాల అవసరం ఎంతో ఉందని, దేశంలో కీలక ఖనిజాల వనరులు ఉన్నప్పటికీ, వాటి మైనింగ్ జరగటం లేదని కాబట్టి ప్రస్తుతం విదేశాల నుండి కీలక ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నామని కమిటీ అభిప్రాయపడింది.
రానున్న కాలంలో కీలక ఖనిజాల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది కనుక దేశంలో గల కీలక ఖనిజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వ మైనింగ్ సంస్థలు, ప్రైవేటు మైనింగ్ సంస్థలు కలిసి నడవాలని సూచించింది.



