భద్రాద్రి అభివృద్ధికి రూ.351 కోట్లు మంజూరు…నేడు రాములోరికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్
భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. స్వామివారి కల్యాణం అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధితోపాటు భద్రాచలం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

దక్షిణ అయోధ్య భద్రాద్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…
చర్ల మార్చి 26(నిజం చెపుతాం)
భక్త రామదాసు నిర్మించిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం “దక్షిణ అయోధ్య”గా ప్రసిద్ధి చెందినదని, ఈ పవిత్ర క్షేత్రానికి దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.
గురువారం భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం, మహా పట్టాభిషేకం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు విచ్చేయనున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతి శాఖ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, వీఐపీలు, వివిఐపీలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.
శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్వామివారి కల్యాణం, 28వ తేదీన అదే సమయాల్లో మహా పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. స్వామివారి కల్యాణం అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధితోపాటు భద్రాచలం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు రహదారులు, రైల్వే, నదీ మార్గాల అభివృద్ధిపై చర్యలు తీసుకుంటున్నామని, అమరావతి–జగదల్పూర్ మధ్య రవాణా సౌకర్యాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని కరకట్టల ఎత్తు పెంపు, ఘాట్‌ల నిర్మాణం, రెండో పీట నిర్మాణం వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో భక్తుల రాకను మరింత సులభతరం చేసే దిశగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
అనంతరం భద్రాచలం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల ఫోటోలను మంత్రి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం మిథిలా స్టేడియం వద్ద జిల్లా కలెక్టర్ అంకిత్ సెక్టార్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలంబ్రాల కౌంటర్లు, ప్రసాదాల కౌంటర్లు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వైద్య సదుపాయాలు వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
సెక్టార్ అధికారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఎక్కడైనా లోపాలు గమనించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు..



