పోలీస్ కొలువుల నగారా: త్వరలో 17 వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్..?
పదవీ విరమణతో భారీగా పెరగనున్న ఖాళీల సంఖ్య ..!

యూనిఫాం వేయాలనేది మీ లక్ష్యమా? ఖాకీ చొక్కాపై నక్షత్రాలు మెరవాలని కలలు కంటున్నారా? అయితే మీ కల నెరవేరే సమయం ఆసన్నమైంది! తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి తెరలేవనుంది.
రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రస్తుతం 17,992 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏటా సుమారు 6 నుంచి 7 వేల మంది పదవీ విరమణ పొందుతుండటంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పని భారాన్ని తగ్గించి, శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసేందుకు ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఖాళీల వివరాలతో కూడిన పూర్తి నివేదికను అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. భారీ రిక్రూట్‌మెంట్: గతంలో 2015, 2018, 2022 సంవత్సరాల్లో భారీగా నియామకాలు జరిగినట్లుగానే, ఈసారి కూడా 17 వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
పోలీస్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు మెయిన్స్ మరియు శిక్షణకు దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది. అందుకే ఆలస్యం చేయకుండా భర్తీ ప్రక్రియను మొదలుపెట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ పోలీస్ శాఖలో మొత్తం మంజూరైన పోస్టులు 95,361 కాగా, ప్రస్తుతం 77,369 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అంటే దాదాపు 18.87% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా వేలమంది నిరుద్యోగులకు ఉపాధి దొరకడమే కాకుండా, శాఖకు కొత్త రక్తం అందుతుంది.



