పరిగి సెగ: నార్సింగిలో హరీష్ రావు అరెస్ట్..!

కీలక నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు..!

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని నర్సింగి (TSPA జంక్షన్) వద్ద ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు, హరీష్ రావుతో పాటు పలువురు కీలక నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పరిగి మండలంలోని కాళ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు 1,200 ఎకరాల భూమిని సేకరిస్తోంది. తమ సారవంతమైన భూములను ఇచ్చేది లేదని గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ, వారికి మద్దతుగా హరీష్ రావు పర్యటనకు పిలుపునిచ్చారు.

మంగళవారం ఉదయం నుండే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితర నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ, పోలీసుల కళ్లుగప్పి బయటకు వచ్చిన హరీష్ రావు పరిగి వెళ్తుండగా నర్సింగి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ప్రజాస్వామ్యంలో రైతుల పక్షాన నిలబడే హక్కు కూడా లేదా? భూములను లాక్కుంటూ, ప్రశ్నించే వారిని జైల్లో పెడతారా?” అని హరీష్ రావు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రస్తుతం పరిగి మరియు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. అరెస్ట్ చేసిన నేతలను షాద్‌నగర్ లేదా శంషాబాద్ వైపు తరలించినట్లు సమాచారం. ఈ అరెస్టులతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.

 

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button