హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ‘షాడో’ల రాజ్యమేల? – ప్రోటోకాల్‌కు పాతర..!
పాలన వారిది.. పెత్తనం వీరిదా? ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా?

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం అసలు సిసలు పాలకవర్గం కంటే, వారి కుటుంబ సభ్యుల పెత్తనమే ఎక్కువగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రులు, భర్తలు, కొడుకులు మున్సిపల్ కార్యాలయంలో తిష్టవేసి చక్రం తిప్పుతుంటే, అసలైన ప్రజాప్రతినిధులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు.
విస్మయానికి గురిచేస్తున్న అంశం ఏమిటంటే.. మున్సిపల్ పాలకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ‘అనధికార’ వ్యక్తుల్లో రిపోర్టర్లు, లాయర్లు, బడా వ్యాపారవేత్తలు ఉండటం. వార్తలను నిష్పక్షపాతంగా రాయాల్సిన రిపోర్టర్లు, చట్టాన్ని గౌరవించాల్సిన లాయర్లు మున్సిపల్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడంపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.
బిజినెస్ చేసే వ్యక్తులు పాలనలో వేలు పెట్టడం వల్ల, మున్సిపల్ టెండర్లు, రహస్య సమాచారం బయటకు పొక్కి తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్యాలయంలోని రికార్డులు, అంతర్గత సమావేశాల్లో ప్రజాప్రతినిధులు మినహా ఇతరులకు ప్రవేశం లేదు. మరి హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ గాలికి ఎగురుతున్నా కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
మున్సిపాలిటీకి సంబంధించిన గోప్యమైన సమాచారం, నిధుల కేటాయింపులు, పట్టణ అభివృద్ధి ప్రణాళికలు బయటి వ్యక్తులకు (ముఖ్యంగా వ్యాపార, న్యాయ వృత్తుల్లో ఉన్నవారికి) తెలియడం వల్ల భవిష్యత్తులో పాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది.



