గృహ జ్యోతికి గ్రహణం…అర్హత ఉన్నా అందని ఉచిత విద్యుత్..!
200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించాలనే సంకల్పం మంచిదే అయినా, దరఖాస్తు ప్రక్రియలో దొర్లిన చిన్న చిన్న లోపాలు వేలాది మంది అర్హులను ఈ పథకానికి దూరం చేస్తున్నాయి

ఎడిట్ ఆప్షన్ లేక లబ్ధిదారుల అవస్థలు.. కొత్త దరఖాస్తుల కోసం ఎదురుచూపులు…!
దరఖాస్తు సమయంలో మీటర్ నంబర్ లేక ‘అనర్హత’ వేటు…!
గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం అవకాశం..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహ జ్యోతి’ పథకం క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించాలనే సంకల్పం మంచిదే అయినా, దరఖాస్తు ప్రక్రియలో దొర్లిన చిన్న చిన్న లోపాలు వేలాది మంది అర్హులను ఈ పథకానికి దూరం చేస్తున్నాయి.
ముఖ్యంగా ప్రజా పాలన సమయంలో మీటర్ నంబర్ సమర్పించని వారు, కొత్తగా అద్దె ఇళ్లకు మారిన వారు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
దరఖాస్తు సమయంలో ‘అనర్హత’ వేటు…!
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సమయంలో చాలా మంది అద్దె ఇళ్లలో ఉండటం లేదా సొంత మీటర్ లేకపోవడంతో విద్యుత్ కనెక్షన్ వివరాలను నమోదు చేయలేకపోయారు.
ఇప్పుడు వారు సొంత ఇళ్లకు మారినా లేదా కొత్త మీటర్లు పొందినా, పాత దరఖాస్తులో ఆ వివరాలను చేర్చే ఎడిట్ ఆప్షన్ సదుపాయం లేకపోవడం శాపంగా మారింది.
గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం అవకాశం..!
గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం కొన్ని సవరణలకు అవకాశం ఇస్తుండగా, అసలు వివరాలే ఇవ్వని వారి పరిస్థితి ‘అగమ్యగోచరం’గా మారింది.
కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా..మున్సిపల్, మండల కేంద్రాల్లోని ప్రజా పాలన కౌంటర్ల వద్ద లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
“అర్హత ఉన్నా కేవలం ఒక నంబర్ నమోదు చేయలేదన్న కారణంతో నెలనెలా కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా ఇళ్లు మారిన వారి కోసం, కొత్త కనెక్షన్లు తీసుకున్న వారి కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ప్రజా పాలన పోర్టల్‌లో పాత దరఖాస్తుదారులకు మీటర్ నంబర్లు, ఇతర వివరాలు కొత్తగా జోడించే అవకాశం కల్పించాలి.
తెల్ల రేషన్ కార్డు ఉండి, విద్యుత్ వినియోగం పరిమితి లోపు ఉన్న ప్రతి పేద కుటుంబానికి నేరుగా ఈ పథకాన్ని వర్తింపజేసేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి. ప్రభుత్వం కేవలం పాత దరఖాస్తుల సవరణకే పరిమితం కాకుండా, కొత్త డేటాను ఎంటర్ చేసే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.
ప్రజా పాలన దరఖాస్తుల్లో విద్యుత్ మీటర్ నంబర్ ఇవ్వని వారికి, కొత్తగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించి కొత్త ఇళ్లకు మారిన వారి కోసం నిరంతర దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి.
రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు వాడకం ఉన్న ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి చేకూరేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్ సర్కార్ స్పందించి ప్రజా పాలన పోర్టల్‌లో పూర్తిస్థాయి ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే, ‘గృహ జ్యోతి’ వెలుగులు నిజమైన పేదల ఇళ్లకు చేరుతాయి.



