పెరుగుతున్న సైబర్ నేరాలు

సామాజిక మాధ్యమాల్లో పరిచయం పెంచుకుని, అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి నకిలీ వేదికల్లో పెట్టుబడులు పెట్టించడంతో బాధితుడు మోసపోయాడు. మరో ఘటనలో పదవీ విరమణ చేసిన ఒక గురువును “డిజిటల్ అరెస్టు” పేరుతో భయపెట్టారు

డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలు

డిజిటల్ సేవలు రోజువారీ జీవితానికి ఊపిరిలా మారిన నేటి పరిస్థితిలో అంతర్జాల నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయి.

బ్యాంకు ఖాతాలు, తక్షణ చెల్లింపులు, సామాజిక మాధ్యమాలు, పెట్టుబడి వేదికలు వంటివన్నీ సౌలభ్యాన్ని పెంచినప్పటికీ అదే సమయంలో మోసగాళ్లకు కొత్త మార్గాలను తెరచాయి.

అవగాహనలో చిన్న లోటే భారీ ఆర్థిక నష్టానికి, వ్యక్తిగత సమాచార దోపిడీకి ప్రధాన కారణమవుతోంది. నేడు అరచేతిలోకి ప్రపంచం వచ్చిన వేళ మన అప్రమత్తతే మనకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

డిజిటల్ అరెస్టు పేరుతో...

ఇటీవల భాగ్యనగరంలో నమోదైన ఘటనలు ఈ ప్రమాద తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయి. నకిలీ పెట్టుబడి పథకాల పేరుతో ఒక ప్రైవేటు ఉద్యోగి కోటి రూపాయలకు పైగా నష్టపోయిన సంఘటన సంచలనమైంది.

సామాజిక మాధ్యమాల్లో పరిచయం పెంచుకుని, అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి నకిలీ వేదికల్లో పెట్టుబడులు పెట్టించడంతో బాధితుడు మోసపోయాడు. మరో ఘటనలో పదవీ విరమణ చేసిన ఒక గురువును “డిజిటల్ అరెస్టు” పేరుతో భయపెట్టారు.

దర్యాప్తు అధికారులమని నటించిన మోసగాళ్లు కేసుల బెదిరింపులతో లక్షలాది రూపాయలు వసూలు చేశారు.

అలాగే అదృష్టవంతుల ఎంపికలో బహుమతి వచ్చిందనే పేరుతో ఒక మహిళ నుంచి పెద్ద మొత్తం దోచుకున్న సంఘటన కూడా వెలుగుచూసింది.

ఇలాంటి పద్ధతులే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ పునరావృతమవుతున్నాయి.

వ్యక్తిగత సమాచారాన్ని  పంచుకోవద్దు

ఈ నేరాలకు ప్రధాన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని నిర్లక్ష్యంగా పంచుకోవడం, అనుమానాస్పద సందేశాలకు స్పందించడం, తక్షణ లాభాల ఆశలో సరైన పరిశీలన లేకుండా పెట్టుబడులు పెట్టడం వంటి అలవాట్లు మోసగాళ్లకు దోహదపడుతున్నాయి.

వయసుతో సంబంధం లేకుండా చదువుకున్న యువత కూడా ఈ మాయలో పడుతున్న వాస్తవం ఆందోళన కలిగిస్తోంది. మోసగాళ్లు ప్రజల భయాన్ని లేదా అత్యాశను పెట్టుబడిగా మార్చుకుని వారిని మానసిక ఒత్తిడికి గురిచేసి ధనాన్ని కాజేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో స్నేహం చేయడం, ఉచిత బహుమతుల పట్ల ఆకర్షితులవ్వడం వంటి పొరపాట్లు నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి.

సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్నప్పటికీ, అతివిశ్వాసంతో ప్రాథమిక భద్రతా నియమాలను విస్మరించడం వల్ల విద్యావంతులు సైతం తమ వ్యక్తిగత మరియు ఆర్థిక రహస్యాలను స్వయంగా వెల్లడించి మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.

డిజిటల్ భద్రతపై అవగాహన ముఖ్యం

ఈ సమస్యకు పరిష్కార మార్గాలు కూడా అంతే స్పష్టంగా ఉన్నాయి. ముందుగా ప్రతి పౌరుడికి డిజిటల్ భద్రతపై అవగాహన అవసరం.

అపరిచితుల నుండి వచ్చే పిలుపులు, సందేశాలపై అనుమానం పెంచుకోవాలి. ఎవరైనా వ్యక్తిగత గుర్తింపు సంఖ్యలు, బ్యాంకు వివరాలు అడిగితే వెంటనే తిరస్కరించాలి.

అనుమానాస్పద లంకెలు తెరవకుండా ఉండటం, తెలియని దస్త్రాలను దిగుమతి చేయకపోవడం మౌలిక జాగ్రత్తలు. బ్యాంకు సేవల్లో ద్విదశ ధృవీకరణను తప్పనిసరిగా వినియోగించాలి.

ఒకవేళ నష్టం జరిగితే ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాల నేరాల సహాయ సంఖ్య 1930 కి సమాచారం ఇవ్వాలి.

మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి

అంకెల ఆధారిత అభివృద్ధి ప్రయాణంలో భద్రతే అసలు పునాది. ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు ప్రజలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కొత్త మోసాల పద్ధతులను ముందుగానే వెల్లడించాలి.

అంతర్జాతీయ స్థాయిలోనూ సహకారం పెంచి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త, అవగాహన, సమిష్టి చర్యలతోనే అంతర్జాల నేరాల నుంచి సమాజాన్ని రక్షించుకోవడం సాధ్యమవుతుంది

(సి.హెచ్.ప్రతాప్)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button