ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్…పనులన్నీ పూర్తి కాకపోయినా బిల్లులు విడుదల…!
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండ్లు పూర్తిగా ఫినిషింగ్ పనులు కాకపోయినా నివాసయోగ్యంగా ఉంటే చాలు, తుది విడత బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించింది.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్… నివాసయోగ్యంగా ఉంటేనే కంప్లీషన్ బిల్లులు విడుదల!
ఫ్లోరింగ్, వైరింగ్ లేకపోయినా గృహప్రవేశానికి గ్రీన్ సిగ్నల్… నిబంధనలు సడలించిన ప్రభుత్వం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండ్లు పూర్తిగా ఫినిషింగ్ పనులు కాకపోయినా నివాసయోగ్యంగా ఉంటే చాలు, తుది విడత బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇండ్లు నిర్మించుకుంటున్న నిరుపేద లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్, వైరింగ్ వంటి చిన్న పనులను వెంటనే పూర్తి చేయలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గృహప్రవేశం త్వరగా చేసుకునేలా నిబంధనలను సరళతరం చేసింది.
సవరించిన ముఖ్య నిబంధనలు ఇవే…
ఫ్లోరింగ్ అవసరం లేదు :
ఇంటి లోపల ఫ్లోరింగ్ పని పూర్తి కాకపోయినా బిల్లులు నిలిపివేయరు.
ప్లాస్టరింగ్ :
ఇంటి వెలుపలి ప్లాస్టరింగ్ పూర్తయితే సరిపోతుంది. లోపలి ప్లాస్టరింగ్ లేకున్నా తుది విడత బిల్లు మంజూరు చేస్తారు.
తలుపులు, కిటికీలు :
లోపలి గదులకు తలుపులు లేకపోయినా పర్వాలేదు. ప్రధాన ద్వారం ఉంటే చాలు.
పెయింటింగ్ :
ఇంటి బయట వైట్ వాష్ లేదా పెయింటింగ్ ఉంటే సరిపోతుంది. రెండో కోట్ నిబంధనను తొలగించారు.
వైరింగ్, ప్లంబింగ్ :
పూర్తిస్థాయి వైరింగ్ లేకపోయినా తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. టాయిలెట్, ఫ్యాన్ వంటి పనులు తప్పనిసరి కాదు.
ఈ మార్పులకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.
క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటి నిర్మాణ పటిష్టతపై మాత్రమే దృష్టి పెట్టాలని, చిన్న చిన్న పనుల కారణంగా బిల్లులు ఆపవద్దని సూచించింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా తుది దశలో ఉన్న వేలాది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుకు మార్గం సుగమమైంది.



