పెట్రోలింగ్ వాహనాల డీజిల్ నిధులు పక్కదారి..? కాగితాల్లో లెక్కలు.. ఆయన జేబుల్లోకే నిధులు..!
శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు గస్తీ తిరిగే పోలీస్ వాహనాలు.. కొందరు అధికారుల జేబులు నింపుకోవడానికి సాధనాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో పెట్రోలింగ్ కోసం కేటాయించే వాహనాలకు కొట్టించే డీజిల్ నిధులు కొందరి అధికారుల జేబుల్లోకి వెళ్లుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి.

ఆడిట్‌లో అంతా ‘ఓకే’.. .. చెల్లింపులు మాత్రం శూన్యం..!
భాధపడుతున్న పెట్రోల్ బంక్ యజమానులు..!
హైదరాబాద్, మార్చి 28, నిజం చెపుతాం :
శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు గస్తీ తిరిగే పోలీస్ వాహనాలు.. కొందరు అధికారుల జేబులు నింపుకోవడానికి సాధనాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో పెట్రోలింగ్ కోసం కేటాయించే వాహనాలకు కొట్టించే డీజిల్ నిధులు కొందరి అధికారుల జేబుల్లోకి వెళ్లుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి.
డీజిల్ కొట్టించుకుని బిల్లులు తీసుకుని బంక్ యజమానులకు చిల్లిగవ్వ కూడా చెల్లించకుండా హుజూర్ నియోజకవర్గంలో ఒక అధికారి చానాళ్లుగా సాగిస్తున్న ఈ తంతు చర్చనీయాంశంగా మారింది. డీజిల్ డబ్బులు అడిగితే ఏమంటాడోనని బంక్ యజమానులు భయపడుతున్నారని తెలుస్తోంది. తమ భాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
బిల్లులు పుల్… చెల్లింపులు నిల్..!
సాధారణంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహనాల పెట్రోలింగ్ , ఇతర అత్యవసర విధులకు నెలకు ఒక్కో స్టేషన్ కు సుమారు 150 నుంచి 200 లీటర్ల వరకు డీజిల్ ను వినియోగించుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిధులు నేరుగా పోలీస్ శాఖ ద్వారా మంజూరవుతాయి.
హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఒక పోలీస్ అధికారికి చానాళ్లుగా ఈ నిధులు విడుదల కావడం లేదా ఏమో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈయన డీజిల్ కొట్టించుకున్న బిల్లులను తీసుకుని బిల్లును చెల్లించడం లేదన్న ఆరోపణలున్నాయి.
ప్రతీ నెల 100 నుండి 150 లీటర్ల ఇంధనాన్ని వాడుతున్నట్లు రికార్డుల్లో (లాగ్ బుక్) చూపిస్తున్నట్లుగా అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. మరి బంక్ లకు ఎందుకు చెల్లించడం లేదన్నదే ప్రశ్న. ఈ నగదును తన సొంతానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
చెప్పుకోలేక పోతున్న బంక్ యజమానులు..!
ఈ వ్యవహారంలో పెట్రోల్ బంక్ యజమానుల పరిస్థితి “ముందు నుయ్యి.. వెనుక గొయ్యి”లా మారింది. సదరు అధికారి తన కారుకు డీజిల్ కొట్టించుకున్న తర్వాత, యజమాని దగ్గర నుంచి పక్కాగా బిల్లులు వెంటనే తీసుకుంటున్నాడు
కానీ ఆ బిల్లులకు సంబంధించిన డబ్బులు మాత్రం చెల్లించడం లేదని పేరు చెప్పడానికి భయపడుతున్న ఒక బంక్ యజమాని చెపుతున్నాడు. “బిల్లులు తీసుకుంటున్నాడే తప్ప, రావాల్సిన అసలు నిధులు ఇవ్వడం లేదని వాపోతున్నారు”.
పోలీసులతో తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనన్న భయంతో, నెలల తరబడి బకాయిలు పేరుకుపోతున్నా పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు.
రికార్డులు ఒకే.. చెల్లింపులు శూన్యం..!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి లాగ్ బుక్ నిర్వహించాలి. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది. ఎంత డీజిల్ వినియోగించారు అనేది ఆడిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం కాగితాల మీద లెక్కలు అద్దంలా మెరుస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అలా కనపడటం లేదని తెలుస్తోంది.
ప్రభుత్వం నుంచి డీజిల్ ఖర్చుల నిమిత్తం వచ్చే నగదు బంకులకు చేరకపోవడంతో, ఆ నిధులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
భారీ మొత్తంలో పేరుకుపోయిన ఈ డీజిల్ బకాయిలు చెల్లించేదెన్నడో, నిధుల మళ్లింపు వ్యవహారంపై సమగ్ర విచారణతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని లాగ్ బుక్ రికార్డులను, బంకుల్లోని సిసి టీవీ ఫుటేజీలను మరియు చెల్లింపుల రికార్డులను పరిశీలిస్తే ఈ ‘తైల’ భాగోతం వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడతాయని భావిస్తున్నారు. ఖాకీల ముసుగులో జరుగుతున్న ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



