వైరాలో ఏసీబీ పంజా..రూ. 24,800 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంవీఐ..!
ట్రాక్టర్లు,టిప్పర్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఉండేందుకు ఎంవీఐ వరప్రసాద్ నెలవారీ మామూళ్లు డిమాండ్..!

ఖమ్మం జిల్లా వైరాలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. రవాణా శాఖలో పాతుకుపోయిన అవినీతి తిమింగలాలపై ఏ.సి.బి పంజా విసిరింది. లంచం తీసుకుంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
ఒక కాంట్రాక్టర్కు చెందిన ట్రాక్టర్లు, టిప్పర్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఉండేందుకు ఎంవీఐ వరప్రసాద్ నెలవారీ మామూళ్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నెలకు రూ. 24,800 లంచం ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ను వేధించడంతో, విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏ.సి.బి డీఎస్పీ రమేష్ బృందం పక్కా వ్యూహాన్ని రచించింది. బుధవారం వైరాలోని ఎంవీఐ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుండి వరప్రసాద్ లంచం తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేశారు. నగదును స్వాధీనం చేసుకుని, అధికారి చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించారు.
ఏసీబీ అధికారులు ప్రస్తుతం వరప్రసాద్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని కీలక పత్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.



