తప్పుడు పద్ధతుల్లో పొందిన పట్టా భూముల వ్యవహారంలో కీలక మలుపు
మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేసిన హైకోర్టు
– రెవెన్యూ,పోలీసు శాఖలు కలుగజేసుకోవద్దని షోకాజు
భద్రాద్రి కొత్తగూడెం, మే 20 (నిజం న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం రెవెన్యూ గ్రామ పరిధిలో గిరిజనులకు చెందిన ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిని గిరిజనేతరులకు తప్పుడు పద్ధతుల్లో తెలంగాణ పట్టా పుస్తకాలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిరిజనులకు వ్యతిరేకంగా వచ్చిన మూడు మధ్యంతర ఉత్తర్వులను తాజాగా తెలంగాణ హైకోర్టు రద్దు చేయడంతో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి.
Also read: తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు
ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సున్నం చంటి అనే వ్యక్తి కుటుంబానికి వారసత్వంగా పూసుగూడెం రెవెన్యూ గ్రామంలో 170,171 మరియు173 సర్వే నంబర్లలో ఎనిమిది ఎకరాల ముప్పై ఏడు గుంటల భూమి సాగులో ఉండగా రెవెన్యూ రికార్డులలో కూడా నమోదై ఉంది. 1954 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పట్టాదారులుగా వీరే ఉండగా 2019 సంవత్సరంలో ములకలపల్లి మండల తహసీల్దారుగా విధులు నిర్వర్తించిన ముజాహిదీన్ గిరిజనేతరులైన షేక్ రఫీ అహ్మద్, షేక్ షఫీ అహ్మద్ మరియు జబీ అహ్మద్ అనే వ్యక్తులకు తెలంగాణ పట్టాదారు పాసుపుస్తకములు మంజూరు చేశారు. ఈ విషయమై గిరిజనులైన సున్నం చంటి మరియు అతని కుటుంబ సభ్యులు పలుమార్లు తహశీల్దార్ కార్యాలయంలోనే కాకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు. అయితే గిరిజనేతరులు వీరికి వ్యతిరేకంగా మూడుసార్లు భద్రాచలం మొబైల్ కోర్టు నుండి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ గిరిజనేతరులు తెచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రద్దుచేయడమే కాకుండా ఈ వివాదంలో తహశీల్దార్, మరియు పోలీసులు తలదూర్చవద్దని షోకాజులు ఇచ్చింది. అయితే ఇంత జరుగుతున్నా తప్పుడు పట్టాలు మంజూరు చేసిన తహశీల్దార్ ముజాహిదీన్ పై ఇంతవరకు ఏలాంటి చర్యలు కానీ విచారణ కానీ చేపట్టనట్టు తెలుస్తోంది.
సున్నం చంటి: బాధితుడు
గిరిజనేతరులు చట్టవ్యతిరేకంగా తప్పుడు పత్రాలు చూపించి మొబైల్ కోర్టు ద్వారా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని మమ్మల్ని మోసం చేస్తున్నారు. మా భూములు ఆక్రమించడం కోసం మాపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. విధిలేని పరిస్థితుల్లో మేము హైకోర్టును ఆశ్రయించగా మోసపూరితమైన వారి ఉత్తర్వులన్నిటిని రద్దు చేశారు. గిరిజనులకు న్యాయం చేయడానికి ఎల్టిఆర్, పీసా చట్టాలు ఉన్నా వాటిని అమలు చేసే విషయంలో అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాత ముత్తాతల నుండి మాకు సంక్రమించిన వారసత్వ భూములను గిరిజినేతరులకు పట్టాలు చేయడం అన్యాయం. విషయం బయటకు వచ్చినా ఇంకా ఆ పట్టాలు రద్దు చేయకుండా మమ్మల్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మమ్మల్ని తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు పిలిపించి వేధిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలు అతిక్రమించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అమాయకులైన గిరిజనులను మోసం చేస్తున్నారు. అంగబలం అర్ధబలం ఉన్న గిరిజినేతరులకు అందినంత సహాయం నిరక్షరాస్యులైన గిరిజనులకు అండడంలేదు. అయినా గిరిజన చట్టాలపై ఉన్న నమ్మకంతోనే మేమింకా పోరాడుతున్నాం. జిల్లా కలెక్టర్ స్పందించి గిరిజినేతరులకు అక్రమంగా మంజూరు చేసిన పట్టాలు రద్దు చేయాలని ప్రాధేయపడుతున్నాం.