Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పురాతన దేవాలయాలకు నిలయం పిల్లలమర్రి

కాకతీయుల కాలం నాటి నిర్మాణాలతో అద్భుత కట్టడాలు. అంతరించిపోతున్న శిలా ఖండాలు.

ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తే, ఆలయాలకు పూర్వవైభవం. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దవచ్చు.

సూర్యాపేట, మే 17 నిజం న్యూస్

సూర్యాపేట పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో.. జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈఊళ్లో ఎటు చూసినా దేవాలయాలే కనిపిస్తాయి. ఆలయాల్లోని శిల్పకళ నాటి కాకతీయుల వైభవానికి అద్దంపడుతుంది.

కాకతీయ రాజులు క్రీస్తుశకం 1000 సంవత్సరాల నుంచి 1324 వరకు తెలుగు ప్రాంతాన్ని పరిపాలించారు. కాకతీయుల మహాసామంతుడైన బేతిరెడ్డి ఆమనగల్లును రాజధానిగా పరిపాలించే కాలంలో పిల్లలమర్రిని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

తన రాజధానిని ఇక్కడికి మార్చి పిల్లలమర్రి బేతిరెడ్డిగా ప్రఖ్యాతి చెందాడు. ఇప్పుడున్న గ్రామ ప్రాంతంలో పూర్వం ఒక గొప్ప మర్రిచెట్టు ఉండేదట. అక్కడికి వేటకు వచ్చిన బేతిరెడ్డికి ఆ చెట్టు కింద ధనం లభించిందని, ఆ ధనంతో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించాడని ఒక కథ ప్రచారంలో ఉంది.

రేచర్ల వంశస్తులు పిల్లలమర్రిలో శిల్పుల మేథాశక్తికి, పనితనానికి నిదర్శనంగా అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు. కాకతీయ రుద్రదేవుడి మరణానంతరం తన తమ్ముడైన నామిరెడ్డికి మహాసామంత ఆధిపత్యం అప్పగించి, బేతిరెడ్డి విశ్రాంతి తీసుకున్నాడు. క్రీస్తుశకం 1202లో రేచర్ల నామిరెడ్డి నామేశ్వరాలయాన్ని నిర్మించాడు. త్రికూట ఆలయంలో మూడు శివాలయాలు ఉన్నాయి.

నామిరెడ్డి పేరు మీద నామేశ్వర, తన తల్లి పేరు మీద కాచేశ్వర, తన తండ్రి పేరు మీద కామేశ్వర లింగాలను దేవాలయంలో ప్రతిష్ఠించాడని పురాణంలో ఉంది. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరుక సానమ్మ 1208లో ఎరుకేశ్వరాలయం నిర్మించింది. ఇటుకలతో నిర్మించిన విమానం, దూలాలపై సముద్ర ముద్ర, మీదన చిత్రాలు, రామాయణ భారతాధి పౌరాణిక గాథ చిత్రాలు అప్పట్లో రమణీయంగా చెక్కారు.

శిల్పాలు ధ్వంసం..

ఇక్కడి ఎరుకేశ్వరాలయం, నామేశ్వరాలయాలలో స్తంభాలపై చెక్కిన శిల్పాలను, త్రికూటాలయంలోని నందిని అప్పట్లో ఔరంగజేబు నాశనం చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

స్తంభాలు.. సప్తస్వరాలు..

నామేశ్వరాలయంలో స్తంభాలను మోగిస్తే సప్తస్వరాలు పలుకుతాయి. ఒకే స్తంభం రకరకాల శబ్ధం వస్తుంది. దేవాలయాలను దర్శించిన వారు స్తంభాలపై నాణెంతో కొట్టి పలు రకాల శబ్ధాలను ఆసక్తిగా వింటారు. కర్నాటకకు చెందిన మోయసాలలోని శిల్పశైలి వీటిలో కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా పిల్లలమర్రి శివాలయాలతోపాటు పెన్ పహాడ్ మండలం నాగులపహాడ్, మహబూబ్ నగర్ జిల్లాలోని పొలంపేటలో దేవాలయాలు ఒకే విధంగా ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు.

త్రికూటాలయంలో ఆసక్తికరమైన నంది..

త్రికూటాలయంలో రేచర్ల నామిరెడ్డి శివలింగాలను కాపాడేందుకు నందిని ఏర్పాటు చేశారు. ఆ నంది మూడు శివలింగాలను కాపాడుతున్నట్లు కన్పిస్తుంది. మూడింటిలో ఏ శివలింగం మందు నిలబడి చూసినా దాని వైపే నంది చూస్తున్నట్లు కన్పిస్తుంది.

దేవాలయాల్లోని స్తంభాలకు విశిష్టత..

దేవాలయాల్లోని స్తంభాల నిర్మాణం ఎంతో విశిష్టతతో కూడుకుని ఉంది. వీటి కింది భాగాన్ని శిల్పశాస్త్రంలో అశ్వపాదమని పిలుస్తారు. స్తంభాల మధ్యలో చతురస్రాకారంలో ఉండే ప్రాంతంలో శిల్పాలు చెక్కి ఉన్నాయి. దేవాలయాల్లో నల్లని శిలలపై నగిషీలు, పద్మాలు, హంసలు, నృత్యభంగిమలు, వాయిద్యకారుల ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. కాకతీయుల రాజ్యాలకు సంబంధించి సంస్కృతం, తెలుగు శాసనాలు లభించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా పిల్లలమర్రి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసి మరమ్మతులు నిర్వహించి, పూర్వ వైభవం తీసుకురావా లని ప్రజలు, మేధావులు కోరుతున్నారు.