పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు…..జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో మే 16 (నిజం న్యూస్)

పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.సోమవారం నాడు పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో జిల్లాల వారిగా సమీక్షించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, ఏ ఒక్క చిన్న సమస్య కూడా ఉత్పన్నం కాకుండా పఠిష్ట చర్యలను చేపట్టాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రాలలో అనుమతించవద్దని, పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేసే సిసి కెమెరాలే కాకుండా కాంపౌండ్ వాల్స్ లేని చోట అదనంగా సిసి కెమెరాలు ఏర్పాటుతో నిఘా ఉంచాలని, పరీక్షా సమయంలో ఆఖరు గంట ఇంకా పకడ్బందీ. నిఘా ఉంచాలని, పరీక్ష సమయం పూర్తయ్యే వరకు ఎవరినీ బయటకు అనుమతించవదని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాల పనితీరును ముందుగానే పరీక్షించుకోవాలని సూచించారు. పరీక్షా సమయంలో జీరాక్సు సెంటర్లు మూసీ వుంచాలని, 144 సెక్షన్ పఠిష్టంగా అమలు చేయాలని తెలిపారు.జిల్లా కలెక్టరు పమేలా సత్పతి పరీక్షా ఏర్పాట్లపై వివరిస్తూ, ఈ నెల 23వ తేదీ నుండి నిర్వహించబడే పదవ తరగతి పరీక్షలలో జిల్లాలో మొత్తం 9477 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నారని,60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 3 సిట్టింగ్ స్క్వాడ్స్, 60 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్స్, 1266 మంది ఇన్వెజిలేటర్ల ఏర్పాటుతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత శాఖల సమన్వయంతో అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, మంచి నీటి ఏర్పాటు, పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా, పరీక్షా సమయానికి తగినట్లుగా ఆర్టిసి బస్ ల ఏర్పాటు, రిజర్వు పరీక్షా సిబ్బంది, తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా విద్యాశాఖ అధికారి నర్సింహ్మ, జిల్లా వైద్య అధికారి డాక్టర్ మల్లికార్జునరావు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ రంగరాజన్, ఆర్టిసి డిపో మేనేజరు శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎడిఇ సత్యప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.