మద్యం సిండికేట్ కు దందా లక్ష ల్లో సార్లకు ముడుపులు

కోదాడ లో వైన్ సిండికేట్ లొల్లి ఆఫీసర్ కు ఎసరు పెట్టింది.సార్లకు ఇవ్వాల్సిన వాటల విషయంలో వ్యాపారుల మధ్య విభేదాలు తలెత్తడంతో వారు రచ్చకెక్కారు. ఏ ఏ ఆఫీసర్ కు ఎంత సమర్పించామన్న లెక్కల్లో తేడాలు రావడంతో ఓ వ్యాపారి నుంచి “మామూలు పే” పేరిట ఉన్న లిస్టు బయటకు వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు కోదాడ లో హాట్ టాపిక్ గా మారింది…
అధికారులకు నెలవారీ మామూళ్లు…
మద్యం సిండికేట్ కు దందాను అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు మామూలు మత్తులో వారికే సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిండికేట్ వ్యవహారంలో గతంలో అధికార పార్టీ నేతల హస్తం ఉండగా, ఇటీవల ఇంటలిజెన్స్ రిపోర్ట్ తమకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ దందా నుంచి వారు వెనక్కి తగ్గారు. దీంతో ఎక్సైజ్ అధికారులు సిండికేట్ నుంచి వచ్చే మామూలును భారీగా పెంచేశారు. సిండికేట్ లో ఇటీవల జరిగిన గొడవలు ఆఫీసర్ల మామూలు విషయం బయటపడింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి కోదాడ నియోజకవర్గం నుంచి ఆఫీసర్లకు లక్షల్లో ముడుపులు అందుతున్నాయి. ఇటీవల జిల్లా నుంచి ట్రాన్స్ ఫర్ అయినా ఓ ఆఫీసర్ పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని బయటపడ్డాట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోదాడ టౌన్ లో ఒక్కో ఆఫీసర్కు మూడు నెలలకు రూ. లక్షకు పైగా చెల్లిస్తున్నారంటే వారి సంపాదన ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. జిల్లాలోని పై ఆఫీసర్ కు నెలకు లక్ష రూ.1.65 లక్షలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కు రూ.1.43 లక్షలు, ఎక్సైజ్ సీఐకి రూ.45వేలు, పోలీస్ డిపార్ట్మెంట్ కు రూ.2.50 లక్షలు అందుతున్నాయి.
వాడవాడలా బెల్ట్ షాపులు..
వైన్ షాప్ నిర్వహించాలంటే ఎన్నో నిబంధనలు, లైసెన్స్, పర్మిట్ రూమ్‌కు లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. ఎమ్మార్పీ ధరకు విక్రయించడంతో పాటు సమయానికి షాపు మూసి వేయాల్సిందే. కానీ బెల్ట్ షాపుల నిర్వాహకులకు ఇవేవీ అక్కరలేదు. ఇదే తమ వ్యాపారానికి సరైన మార్గం అని ఆలోచించిన వైన్ షాప్ యజమానులు గ్రామాల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారు.ఊరూరా తిరుగుతూ కూరగాయలు అమ్మినట్టు మద్యం అమ్ముతున్నారు.కోదాడ నియోజకవర్గంలోని కోదాడ, మునగాల, నడిగూడెం, చిలుకూరు, అనంతగిరి, మోతే మండలంలో సుమారు ఐదువందలకు పైగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వీటి ద్వారానే రోజుకు లక్షల రూపాయల వ్యాపారం సాగుతోంది. ఇదే అదునుగా భావించిన బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో క్వాటర్‌పై రూ.30 నుంచి రూ.40 వరకు అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.మద్యం వ్యాపారుల సిండికేట్ అయి బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ ఉంటే ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.కేవలం ఎన్నికల సమయంలో తూతూమంత్రంగా బెల్ట్ షాపులు మూసివేయించిన పోలీసులు ప్రస్తుతం వాటి గురించి ఏమాత్రం పట్టించుకోక పోవడం విచారకరం. బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయాలని మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.