Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గోదావరిని మింగేస్తున్న ఆంధ్ర బినామీలు

– తెలంగాణ గోదారిలో ఆంధ్రా తోడేళ్లు.

– జానంపేట ఇసుక ర్యాంపులో
యథేచ్ఛగా అక్రమాలు.

– ట్రాక్టర్ యజమానులకు పైసలిచ్చి లారీలతో తోలకాలు.

– ప్రతిదాంట్లో అధికారులకు వాటాలు.

– ప్రశ్నిస్తే అంతుచూస్తామంటూ
బెదిరింపులు.

పినపాక ఏప్రిల్ 8 (నిజం న్యూస్);గోదారమ్మ కడుపులో గుణపం పోటెత్తుతోంది. రక్తపు మడుగులతో ఆ తల్లి మౌనంగా రోదిస్తోంది. తెలంగాణ గోదారిలో ఆంధ్రా తోడెళ్ల పెత్తనం సాగుతోంది. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా లారీల శబ్దం హోరుత్తుతోంది. ఎవరైనే అదేమని అడిగితే అక్కడి మహిళా సైన్యం అంతుచూస్తోంది. మరో అడుగు ముందుకేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది. ఇదంతా ఎవరికీ తెలియకుండా జరుగుతోందనుకుంటే పొరపాటే! టీఆర్ఎస్ నేతల ఆదేశానుసారం అధికారుల అనుగ్రహానుసారం. జరుగుతున్న అక్రమ పర్వం. జానంపేట ఇసుక ర్యాంపుల్లోని చీకటి కోణంపై నిజం న్యూస్ విశ్లేషణాత్మక కథనం.

తెలంగాణ సర్కారు పేదల బతుకులు మార్చాలనే సదుద్దేశంతో ఇసుక ర్యాంపులకు అనుమతులు ఇస్తోంది. సొసైటీలను ఏర్పాటు చేసి గిరిజనులకు ఆసరాగా నిలవాలనే సంకల్పంతో పనిచేస్తోంది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. సొసైటీ సభ్యులకు పావలా అణా ఆశగా చూపి కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొడుతున్నారు. రాత్రీ, పగలూ అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుకను తోడెస్తున్నారు. పేదోళ్ల బతుకులు మారడం సంగతేమో కానీ కాంట్రాక్టర్లకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. జానంపేట ఇసుక ర్యాంపులో అక్రమ దందా మూడు లారీలు ఆరు బకెట్లుగా విరాజిల్లుతోంది!

తెలంగాణలో
ఆంధ్రోళ్ల దోపిడీ…

తెలంగాణ వనరులను ఆంధోళ్లు దోచుకెళ్లడాన్ని సహించలేకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. ఎందరో బలిదానాలతో చివరికి ప్రత్యేక రాష్ట్ర సిద్ధించింది. తెలంగాణనైతే సాధించుకున్నాము కానీ ఆంధోళ్ల దోపిడీ మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రధాన ఆర్థిక వనరైన ఇసుకను ఆంధ్రోళ్లు కొల్లగొడుతున్నారు. తెలంగాణ గిరిజనుల బతుకుల కోసం జానంపేటలోని భూపతిరావుపేటలో ఇసుక సొసైటీకి అనుమతిస్తే ఆ ముసుగులో ఆంధోళ్లు వ్యాపారం చేస్తున్నారు. సొసైటీ సభ్యులకు పావలా, అణా ముచ్చజెప్పి కోట్లు కాజేస్తున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిలువునా ముంచేస్తున్నారు.

also read: పిడుగు పాటుకు ఆవు, దూడ మృతి

జీరో తోలకాలు..
కావాల్సినన్ని బకెట్లు..

భూపతిరావుపేట ఇసుక ర్యాంపులో దోపిడీ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవకాశం ఉన్నకాడికి జీరో తోలకాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పట్టపగలే అందరూ చూస్తుండగా పదుల సంఖ్యలో లారీలను ఎటువంటి బిల్లులు లేకుండానే పంపిస్తున్నట్టు సమాచారం. ఇక ఎక్స్ ట్రా బకెట్ల సంగతి చెప్పనక్కర్లేదు. అడిగినోళ్లకు, అడగనోళ్లకు కావాల్సినన్ని బకెట్లు పోస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ లారీల వాళ్లు వద్దని వారిస్తే.. సీరియల్ సమయంలో వెయిట్ చేయించి సతాయిస్తున్నారట. ఇక లారీల వాళ్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు ఇస్తున్నారట. రెండు బకెట్లు పోసుకుంటే మరో బకెట్ ఫ్రీగా వేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.

ట్రాక్టరోళ్లకు పైసలు..
లారీలతోనే తోలకాలు..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సొసైటీ లోపలికి లారీలకు అనుమతి ఉండదు. గోదావరిలోపల నుంచి ట్రాక్టర్లతో ఇసుకను తీసుకొచ్చి డంప్ చెయ్యాలి. అక్కడి నుంచి లారీల్లోకి లోడ్ చెయ్యాలి, కానీ భూపతిరావుపేట ఇసుక ర్యాంపులో ఈ నిబంధనలన్నింటికీ తిలోదకాలు పలికేశారు. గోదావరి మధ్యలోకి పర్మినెంట్ గా ఉండేలా పెద్ద రోడ్డు వేశారు. రాత్రిపూట టిప్పర్లతో తీసుకొచ్చి డంపింగ్ యార్డులో పోస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు మొదట్లో గొడవ చేశారు. వాళ్లకు ఒక్కో ట్రాక్టర్ కు నెలకు రూ.39 వేలు ఇచ్చి సెటిల్ మెంట్ చేసినట్టు తెలిసింది. ఇలా సుమారుగా వంద ట్రాక్టర్లకు ప్రతినెలా డబ్బులు చెల్లిస్తున్నారు. ఇంట్లోనే ట్రాక్టర్ పెట్టుకుంటే డబ్బులు వస్తున్నందున యజమానులు సైతం మిన్నకున్నారు. వీళ్లందరికీ నాయకత్వం వహించే ట్రాక్టర్ యజమానులు ఐదుగురికి రెండు, మూడు ట్రాక్టర్ల డబ్బులు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనివల్ల అక్కడి భూగర్భ జలాలు అడుగంటుతాయని తెలియక వాళ్లు సైతం అక్రమంలో పరోక్షంగా భాగస్వాములు అవుతున్నారు. నిబంధనలతో సంబంధం లేకుండా లోతైన తవ్వకాలు, గోదావరి నిండా గ్రావెల్ వంటి వాటితో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. తద్వారా భవిష్యత్తులో భూపతిరావుపేట పరిసర ప్రాంతాల్లో భూములన్నీ బీళ్లుగా మారే అవకాశముందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

తప్పంటే
తన్నులు తిన్నట్టే!

భూపతిరావుపేటలో జరిగే దందాను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. స్థానికంగానే ఉన్న కొందరు గిరిజన మహిళలకు డబ్బులు ఆశగా చూపి ర్యాంపు దగ్గర కాపలా పెడుతున్నారు. ఆ ర్యాంపులోకి ఎవరినీ రానియ్యకుండా అడ్డుకోవడం ఆ మహిళా సైన్యం పని. చివరికి విలేకరులను సైతం అక్కడికి అనుమతించడం లేదు. గతంలో ఒక మానవ హక్కుల నేత ఒకరు అక్కడికి వెళ్లగా ఆ మహిళా సైన్యం ప్రత్యక్ష దాడికి తెగబడింది. విచక్షణారహితంగా కొట్టింది. అక్కడి ర్యాంపు నిర్వాహకులు అతడిని చంపే ప్రయత్నం కూడా చేశారని అతను ఆరోపించాడు. దీనిపై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టగా ర్యాంపు నిర్వాహకులు ఆ మహిళల చేత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టించారు. అప్పటినుంచి అటువైపు వెళ్లాలంటేనే అందరూ భయపడుతున్నారు.

నిబంధనలు నిల్లు..
అధికారుల జేబులు ఫుల్లు…

భూపతిరావుపేట ఇసుక ర్యాంపులో ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. ప్రతీ జీరో లారీలో, ప్రతీ బకెట్ లో టీఎస్ఎండీసీ అధికారులకు వాటాలు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ సొసైటీ సభ్యులే బహిరంగంగా చెప్పడం గమనార్హం. ఓ రోజు పైసలు ఆరోజే సాయంత్రం లేక్కచూసుకుని మరీ తీసుకెళుతున్నారట సదరు అధికారులు. ఇంత జరుగుతుంటే ఆంధోళ్లు దోచుకెళుతుంటే స్థానిక టీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? కావాల్సిన కాడికి ఆంధోళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు. వాటాలు తీసుకుని మిన్నకుంటున్నారని సమాచారం. అసలు ఈ దోపిడీ అంతా స్థానిక టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఇసుక ర్యాంపునకు అనుమతి రావాలంటేనే సవాలక్ష నిబంధనలు… ఎన్నో శాఖల అనుమతులు… కానీ ర్యాంపు నిర్వహణలో మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ఆ నిబంధనలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఆ అనుమతులన్నీ నీటిమీద రాతలే అవుతున్నాయి. ఇకనైనా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని భూపతిరావుపేట ఇసుక క్వారీలో జరుగుతున్న అక్రమ దందాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ సంపదను కాపాడాలని వేడుకుంటున్నారు..