బిజెపి పార్టీలో లుకలుకలు

బిజెపి పార్టీలో లుకలుకలు
బిజెపి లోకి ఆర్ ఎన్ ఆర్ ?
చందుపట్ల కీర్తిరెడ్డి దారెటూ ?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మే8 నిజం న్యూస్
బిజెపి పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డి కి గడ్డుకాలం ఎదురైనట్లు జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కీర్తిరెడ్డి వెంటనే జనాల్లోకి రాకపోవడంతో నిరాశ చెందిన కొంత మంది కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల కాలంలో మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లి గ్రామానికి చెందిన మాజీ పోలీస్ ఆఫీసర్ కటంగూరి రాం నర్సింహారెడ్డి ( ఆర్.ఎన్.ఆర్ ) పదవి విరమణ పొంది ఆర్ఎన్ఆర్ ట్రస్ట్ పేరుతో జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు.
also read: పిడుగు పాటుకు ఆవు, దూడ మృతి
జిల్లాలోని ఏ గోడ మీద చూసినా, ఏ కల్వర్టు పైన చూసిన గాని ఆయన పేరే కనబడుతున్నది. దాంతో ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడైన ఆర్ఎన్ఆర్ కు బిజెపి పార్టీ తరఫున భూపాలపల్లి టికెట్ వస్తున్నదని జిల్లాలో ప్రచారం జోరందుకుంది. దాంతో అలర్ట్ అయిన కీర్తిరెడ్డి భారీ వ్యయంతో ఆగమేఘాల మీద భూపాలపల్లిలో బిజెపి సభను ఏర్పాటు చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల ను రప్పించి కార్యకర్తలల్లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. సభలో ఎమ్మెల్యే గండ్ర దంపతుల పై తీవ్ర విమర్శలు చేయగా మర్నాడు ఎమ్మెల్యే గండ్ర విలేకరుల సమావేశం నిర్వహించి ,గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కని కీర్తిరెడ్డి తమను విమర్శించడం హాస్యాస్పదమని, తమను విమర్శించే స్థాయి,అర్హత ఆమెకు లేదని ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా కీర్తిరెడ్డి తమను పట్టించుకోవడం లేదంటూ పార్టీలోని జిల్లా స్థాయి నేతలు, మండల స్థాయి నేతలు కీర్తిరెడ్డి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ జిల్లా స్థాయి నేత ( ఫైర్ బ్రాండ్ ) కీర్తి రెడ్డి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. కాగా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన సుద్దాల వెంకటేశ్వర్లు అనే సీనియర్ కార్యకర్త కీర్తిరెడ్డి తమను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడ పోతున్నదని బాహాటంగానే విమర్శిస్తున్నాడు. జిల్లాలో ఓ పక్క ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్సీ సిరికొండ మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ తిరుగుతున్నారని కానీ బిజెపి పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆయన వాపోయాడు. జిల్లాలోని కొంత మంది బీజేపీ కార్యకర్తలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారని విశ్వసనీయ సమాచారం.