విద్యార్థులు స్వంత కృషితోనే ప్రేరణ పొందాలి……జిల్లా కలెక్టరు పమేలా సత్పతి

విద్యార్థులు స్వంత కృషితోనే ప్రేరణ పొందలి……జిల్లా కలెక్టరు పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో మే 5 (నిజం న్యూస్)
విద్యార్థులు తమ (హార్డ్ వర్క్) స్వంత కృషితోనే ప్రేరణ పొందాలని, అదే విజయానికి మూలమని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి విద్యార్థులకు ఉద్బోధించారు.గురువారం నాడు భువనగిరి పట్టణంలోని సాయికృప కాలేజీలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బిసి బాలురు, బాలికల వసతి గృహాల పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే ప్రేరణ, శిక్షణా తరగతుల కార్యక్రమంలో జిల్లా కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరైనారు.తొలుత సరస్వతి చిత్రపటాలనికి పూలమాలలతో నమస్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు విద్యార్థినీ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. తమ స్వంత కృషితోనే ప్రేరణ పొందాలని, స్వంత హార్డ్ వర్క్ కన్నా వేరే ప్రోత్సాహం ఏదీ ఉండదని, అదే విజయానికి మూల కారణమని తెలిపారు. విద్యార్థులు వేరే ఆలోచనలు లేకుండా పూర్తి ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసంతో పరీక్షలలో విజయం సాధించాలని అన్నారు.ఈ శిక్షణా తరగతులలో మంచి శిక్షణ పొందాలని, నిర్ణీత ప్రణాళికతో సాధన చేసి పరీక్షలలో మంచిగా వ్రాసి ఉన్నతమైన భవిష్యత్తు ను ఏర్పరచుకోవాలని ఉద్బోధించారు.ఈనెల 23 నుండి వ్రాసే పరీక్షలకు ఇంకా పదహారు రోజుల సమయం మాత్రమే ఉందని, మీరు చదివిన దానిని పునశ్చరణ చేసుకోవాలని, సమయం చాలా విలువైనదని, ఎట్టి పరిస్థితిలో వృధా చేయవద్దని, పరీక్షలకు బాగా సిద్దపడితే ఎలాంటి భయాలు ఉండవని, సిలబస్ శ్రద్ధగా చదవాలని, ప్రాక్టీస్ పేపర్స్ బాగా చేయాలని, ప్రశ్నలను బాగా చదవాలని సూచించారు. పదవతరగతిలో మనం చదివే ఫార్ములా అనంతరం ఉన్నత చదువులలో బాగా ఉపయోగపడుతుందని అన్నారు. తన మీద తనకు నమ్మకం పెంచుకోవాలని, నేను పరీక్షలకు బాగా సిద్ధమయ్యాను, ఎలాంటి ప్రశ్నలకైనా వంద శాతం వ్రాస్తాను అనే ఆత్మ విశ్వాసంతో సిద్ధం కావాలని, జిపిఎ పదికి పది సాధించాలని, మంచి విద్యా సంస్థలలో సీట్లు సాధించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. వసతి గృహాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి పదవ తరగతి పరీక్షలలో టాపర్స్ సాధించిన విద్యారినీ విద్యార్థులను తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానిస్తానని తెలియచేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా విద్యాశాఖ అధికారి నర్సింహ్మ విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈనెల 23 నుండి జూన్ ఒకటవ తారీఖు వరకు జరిగే పదవ తరగతి పరీక్షలో 23 నుండి 28 వ తేదీ వరకు ఒక్క సెలవు రోజూ కూడా లేదని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఇప్పటి నుండే సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాలని సూచించారు. గత రెండు సంవత్సరాలుగా కోవిద్ మూలంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించ లేకపోయామని,ఈ సంవత్సరం ఆలస్యంగా క్లాసులు ప్రారంభమైనాయని, అందుకే ప్రత్యేక కార్యాచరణతో ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు. వేసవి దృష్ట్యా అందరు జాగ్రత్తగా వుండాలని, పరీక్షా కేంద్రాలలో మంచినీటి వసతి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 23 వ తేదీ మొదటి రోజు పరీక్షకు గంటకు పైగా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య మాట్లాడుతూ, 184 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ ప్రేరణ తరగతులకు హాజరవుతున్నారని, మిగిలిన ఈ కొద్ది రోజులలో ప్రణాళికాబద్ధంగా చదివాలని అన్నారు.అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ ను జిల్లా కలెక్టరు బహుకరించారు. కార్యక్రమంలో శిక్షణా తరగతుల ఫ్యాకల్టీ బృందం మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులు ఏ. రాజేంద్రప్రసాద్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు సి.హెచ్ హరికృష్ణ, బయాలజీ సైన్స్ ఉపాధ్యాయులు విజయ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.