మణుగూరు ఉన్నత పాఠశాలలో పబ్లిక్ లైబ్రరీ

– స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే రేగా
– అభ్యంతరం తెలిపిన హెచ్ఎం… కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్న డిఈఓ
– గతంలోనే సమస్యలు బయటపెట్టిన నిజం న్యూస్
భద్రాద్రి బ్యూరో ఏప్రిల్ 24 (నిజం న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఘనచరిత్ర ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆక్రమణల ఉచ్చులో బిగుసుకుంటుంది. భావిభారత పౌరులను సానబెట్టే అక్షరాల కొలిమి నేడు తన ఉనికిని కోల్పోయే స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అభివృద్ధి పథంలో ముందుండి నడిపించాల్సిన ప్రజాప్రతినిధులే అక్రమాలకు తెరలేపుతున్నారు…
దశాబ్దాలుగా ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్ధిన మణుగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని పబ్లిక్ లైబ్రరీ పేరుతో కబళించే యత్నాలు మొదలైయ్యాయి.
పాఠశాల ముందున్న రెండు అంతస్థుల భవనాన్ని పబ్లిక్ లైబ్రరీగా మార్చడానికి స్థానిక ఎమ్మెల్యే రేగా స్వయంగా రంగంలోకి దిగారు. పాఠశాల వర్కింగ్ అవర్స్ నడుస్తుండగానే ఎమ్మెల్యే రేగా పిఏ పాఠశాలలోకి ప్రవేశించి బిల్డింగ్ కొలతలు వేయడం గమనార్హం.
also read: టీవీఎస్ బండి లో ఇరుక్కున్న త్రాచు పాము
అయితే పాఠశాల హెచ్ఎం పటేల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం డిఈఓ కి సమాచారం అందించారు. స్థానికంగా ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ హాల్ ,మెల్విన్ జొన్స్ గ్రంధాలయాలు అందుబాటులో ఉన్నా కూడా వాటిని వదిలి విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలపై దృష్టి సారించడం, అందులోనూ గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఎమ్మెల్యే ఇలాంటి చర్యలకు దిగడం ఏమిటో అర్ధంకాని విషయం. పాఠశాలలోకి బయటి వ్యక్తులు రాకపోకలు కొనసాగిస్తే అందులో ఉన్న విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పాఠశాల వెనుకగల గోడను గుర్తుతెలియని ఆకతాయిలు కూలగొట్టి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే విషయంపై నిజం న్యూస్ ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే. ఈ విషయమై భద్రాద్రి జిల్లాకు చెందిన మానవహక్కుల సంఘం సభ్యుడొకరు సెంట్రల్ గ్రీవెన్స్ లో చేసిన ఫిర్యాదు సిఎం పేషీ నుండి కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేయబడి ఇంకా పెండింగులో ఉండగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండడం అధికారుల నిర్లక్ష్యానికి, ప్రజాప్రతినిధుల అవివేకానికి నిదర్శనం.
కుదరదని తేల్చిచెప్పాం:- సోమ శేఖర శర్మ, డిఈఓ భద్రాద్రి కొత్తగూడెం
ఈ విషయమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఈఓ ని ఫోన్ లో వివరణ కోరగా పాఠశాల హెచ్ఎం ఈ విషయాన్ని చెప్పారని, పాఠశాలలో ఎలాంటి ఇతర కార్యకలాపాలకు అనుమతించబోమని చెప్పారు. జిల్లా పరిషత్ పాఠశాలలో భవనాలు జిల్లా పరిషత్ సిఈఓ పరిధిలో ఉంటాయని వారితో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ప్రస్తుతం అమలవుతున్న మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.