అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి శ్రీ “బండిరాజుల శంకర్

అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి శ్రీ “బండిరాజుల శంకర్ ” ……….
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 (నిజం న్యూస్)
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ కవితల పోటీలు” నిర్వహించింది.ఈ పోటీలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన కవి బండిరాజుల శంకర్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 23 న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద బండిరాజుల శంకర్ తమ కవితను వినిపించబోతున్నారు.భారత దేశ ఉనికిని చాటి చెప్పుచూ, భావయుక్తంగా వారు రాసిన *”మానవత్వం నా ఉనికి”* అనే కవిత ఈ పోటీలో ఎంపికయింది.ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి రావు,తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే ఈ “తానా కవితాలహరి” కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. “యప్ టీవీ” ద్వారా అమెరికాతో పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.ఈ టీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది.సరళమైన భాషలో, సామాజిక అభ్యుదయాన్ని కాంక్షిస్తూ రచనలు చేసే శంకర్ గారు 120 పద్యాలతో “స్వామి వివేకానంద సూక్తిశతి” అనే శతకాన్ని ప్రచురించి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ చేతులమీదుగా ఆవిష్కరణ గావించారు.వృత్తి రీత్యా వీరు ఉపాధ్యాయులు. బుఱ్ఱకథలను రాస్తారు, గానంచేస్తారు. పాటలు రాస్తారు.