ఆ ఏడుగురే మా చావుకు కారణం..!

కామారెడ్డి ఏప్రిల్16 నిజం న్యూస్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల న్యూ మహారాజ లాడ్జిలో తల్లికొడుకులు సజీవదహనమయ్యారు.
ఈ ఘటన కామారెడ్డిలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మృతులు రామయంపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రామయంపేట కేంద్రానికి చెందిన గంగు సంతోష్, పద్మ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ మహారాజ లాడ్జిలో రూమ్ నంబర్ 203 లో ఉన్నారు. అయితే తెల్లవారురaామున రూంలో నుంచి పొగలు రావడంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చూడగా తల్లి కొడుకులు సజీవదహనమయ్యారు. అయితే తమ చావుకు ఆ ఏడుగురే కారణం అంటూ ఫోటోలు విడుదల చేసారు. దాంతో ఈ ఆత్మహత్య ఘటన సంచలనం రేపింది.
also read: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన దీక్ష
మృతులు రిలీజ్ చేసిన ఫోటోలలో గతంలో రామయంపేట సిఐగా పనిచేసి బదిలీపై వెళ్లిన నాగార్జున గౌడ్ సహా పలువురు రాజకీయ నాయకుల ఫోటోలు కూడా ఉండటం కలకలం రేపుతోంది. మృతులు చనిపోకముందు సెల్ఫీ వీడియో ద్వారా ఫేస్ బుక్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘నా పేరు గంగు సంతోష్. మా నాన్న పేరు అంజయ్య. మా చావుకు ఆ ఏడుగురే కారణం. వారి వల్ల 18 నెలలుగా చాలా రకాలుగా నష్టపోయాం. నా తల్లిదండ్రులకు మనఃశాంతి లేకుండా చేశారు. ఆ ఏడుగురి ద్వారా మనఃశాంతి లేదు. వీళ్ళ వల్ల ఆస్తులు ఆస్తి, డబ్బు నష్టపోయాను. అప్పులు కూడా చేసాను. డబ్బులు పోయినా పరవాలేదు. మళ్ళీ సంపాదించుకోగలను. నా పర్సనల్ వ్యవహారాలు రామయంపేట సిఐ నాగార్జున గౌడ్, జితేందర్ గౌడ్ లు మెమరీ కార్డు ద్వారా తస్కరించి మానసికంగా వేదించారు. వారిపై ఫిర్యాదు చేసి 110 రోజులు అవుతోంది. రాజకీయ నాయకులకు, ప్రముఖులకు ఫిర్యాదు చేసిన. అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఒక్క శాతం కూడా న్యాయం జరగలేదు. ఇంకా వారి వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళ వల్ల అమ్మా నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఫ్యామిలీకి మమ్మల్ని దూరం చేస్తున్నారు. మేము చనిపోయాక అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇక సెలవు’ అంటూ సెల్ఫీ వీడియో ద్వారా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనం రేపుతోంది. మృతులు విడుదల చేసిన ఫోటోలు రాజకీయ నాయకులకు సంబంధించినవి కావడంతో చర్చనియంశంగా మారింది. ఈ విషయమై కామారెడ్డి డిఎస్పీని వివరణ కోరగా ఉదయం తమకు లాడ్జిలో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు సమాచారం రావడంతో ఫైర్ సిబ్బందితో మంటలు ఆర్పి మృతులు ఉన్న గదిలోకి వెళ్లి చూసేసరికి చనిపోయారన్నారు. తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోందని, చనిపోకముందు ఫేస్ బుక్ లో వీడియో ద్వారా మాట్లాడిన విషయాలపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.