ఎన్ సి ఎల్ కు రూ. 91,42,66,220ల జరిమాన..?

హుజూర్‌నగర్‌, నిజంన్యూస్‌:
మట్టపల్లిలోని ఎన్‌సీఎల్‌ పరిశ్రమ తీసుకున్న అనుమతుల కంటే ఎక్కువగా మైనింగ్‌ చేస్తుందన్న ఫిర్యాదుతో రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ అధికారులు ఈటీఎస్‌ సర్వేను నిర్వహించగా ఆ సర్వేలో అదనంగా 16,32,028 మెట్రిక్‌ టన్నులు తీసినట్లు తేలడంతో అధికారులు రూ. 91,42,66,220ల రాయల్టీ మరియు సేల్‌ ప్రైజ్‌ చెల్లించాల్సిందిగా డిమాండ్‌ నోటీస్‌ను పంపగా, పరిశ్రమ యాజమాన్యం అధికారులు చేసిన కొలతల్లో తప్పులున్నాయని ఏప్రిల్‌ 4న హైకోర్టును ఆశ్రయించగా , ఉన్నతా న్యాయస్థానం ఏప్రిల్‌ 7న ఇచ్చిన తీర్పులో డిమాండ్‌ నోటీస్‌పై 20 శాతం ముందుగా చెల్లించి థర్డ్‌ పార్టీతో మైనింగ్‌లో సర్వే చేయించాలని ఆదేశాలను జారీ చేసింది.

also read: భారత విదేశాంగ విధానానికి ఇమ్రాన్ ప్రశంసన
2019లోనే ఫిర్యాదు….
హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలోని మట్టపల్లి వద్ద ఉన్న ఎన్‌సీఎల్‌ యాజమాన్యం తీసుకున్న అనుమతుల కంటే ఎక్కువగా సున్నపురాయి మైనింగ్‌ చేస్తుందని 31/12/2019లో కర్నాటి వెంకటరెడ్డి ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్‌ నాగపూర్‌కు ఫిర్యాదు చేసారు. నాగపూర్‌ వారు ఈ ఫిర్యాదును ఢల్లీికి పంపగా వారు దీనిపై ఎంక్వైయిరీ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి, మైనింగ్‌ శాఖకు పంపగా వారు 2019 జులైలో ట్రాక్‌ ఏజెన్సీ ద్వారా మైనింగ్‌ శాఖ కొలతలు తీయడం జరిగినట్లు తెలిసింది. సుల్తాన్‌పూర్‌తండా, గుండ్లపల్లి, పెదవీడు మైనింగ్‌లలో కొలతలు తీయగా 5,42,302 మెట్రిక్‌ టన్నులు పర్మిట్లు తీసుకున్న దానికంటే ఎక్కువగా తీసుకున్నారని విచారణలో తేలినట్లు తెలిసింది. దీంతో షోకాజ్‌ నోటీసును 2019 నవంబర్‌లో పరిశ్రమకు ఇచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత అధికారులే లెక్కింపులో పొరపాటు జరిగిందని ఇచ్చిన షోకాజ్‌ నోటీసును డిసెంబర్‌లో వెనక్కి తీసుకున్నారు.


పునర్విచారణ చేయాలని కోరిన పిటిషన్‌దారు…
పిటిషన్‌ దారు 2019 డిసెంబర్‌లో ఎన్‌సీఎల్‌ మైనింగ్‌పై పునర్విచారణ చేయాలని తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌కు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదును నల్లగొండ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారికి తిరిగి విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విజిలెన్స్‌ అధికారులు 22/7/2021లో విచారణ చేయగా పెదవీడులోని 540 సర్వే నెంబర్‌ మైనింగ్‌లో పర్మిట్లు తీసుకున్నది 4,24,350 మెటిక్ర్‌ టన్నులు కాగా దానికంటే అదనంగా 11,21,678 మెట్రిక్‌ టన్నులు అదనంగా తేలినట్లు తెలిసింది. మరోసారి ట్రాక్‌ ఏజెన్సీ ద్వారా ఈటీఎస్‌ సర్వే చేయగా 16,32,028 మెట్రిక్‌ టన్నులు ఎక్కువగా తవ్వినట్లు తేలడంతో మైన్స్‌ అండ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1957 సెక్షన్‌ సెక్షన్‌ 21(5) ప్రకారం ప్రభుత్వానికి రూ. 91,42,66,220లరాయల్టీ మరియు సేల్‌ ప్రైజ్‌ చెల్లించాల్సిందిగా డిమాండ్‌ నోటీస్‌ నంబర్‌ 16843/ఎన్‌సీఎల్‌/ఎస్‌ఆర్‌పీటీ/2021ను 17/3/2022న డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ హైదరాబాద్‌ వారు ఇచ్చినట్లు తెలుస్తోంది.

హైకోర్టును ఆశ్రయించిన ఎన్‌సీఎల్‌ యాజమాన్యం..
సదరు నోటీస్‌పై ఎన్‌సీఎల్‌ యాజమాన్యం సర్వేలో కొలతలు సక్రమంగా నిర్వహించలేదని హైకోర్టును 4/4/2022న ఆశ్రయించగా ఉన్నత న్యాయస్థానం డిమాండ్‌ నోటీస్‌పై 20 శాతం చెల్లించి థర్డ్‌ పార్టీ సర్వే కోసం డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీకి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలను జారీ చేసినట్లు తెలిసింది.
నేనే ఫిర్యాదు చేసా…
కర్నాటి వెంకటరెడ్డి(న్యాయవాది): ఎన్‌సీఎల్‌ పరిశ్రమ అక్రమ మైనింగ్‌ పాల్పడుతుందని తానే మైనింగ్‌శాఖ నాగపూర్‌కు ఫిర్యాదు చేసా. ఆ తర్వాత కొలతలు నిర్వహించగా అదనంగా 5,42,302 మెట్రిక్‌ టన్నులు పర్మిట్లు తీసుకున్న దానికంటే ఎక్కువగా తీసుకున్నారని విచారణలో తేలినట్లు తెలిసింది. ఆ తర్వాత అధికారులు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవడంతో మరోసారి మైనింగ్‌శాఖను తిరిగి విచారణ చేయాలని ఫిర్యాదు చేసా. పునర్విచారణలో 16,32,028 మెట్రిక్‌ టన్నులను అదనంగా తీసినట్లుగా మైనింగ్‌ శాఖ అధికారులు తేల్చి రూ. 91,42,66,220ల రాయల్టీ మరియు సేల్‌ ప్రైజ్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా ఆదేశించారు.

నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే…
జిల్లా గనులు, భూగర్భ శాఖ ఎడీ రమణ
ఎన్‌సీఎల్‌ పరిశ్రమ పర్మిట్లు తీసుకున్న దాని కంటే ఎక్కువగా మైనింగ్‌ చేసిందని తమ ఈటీఎస్‌ సర్వేలో తేలడంతో ఉన్నతాధికారులు రూ. 91,42,66,220ల రాయల్టీ మరియు సేల్‌ ప్రైజ్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా డిమాండ్‌ నోటీసులను పంపిన మాట వాస్తమే.