Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సామాన్యుడి బుర్రకెక్కని రెవెన్యూ ప్రక్షాళన

 

తెలంగాణలో భూచట్టాలకు నూరేండ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. మొట్టమొదటిసారి నిజాం రాష్ట్రంలో 1907లో ‘ఫస్లీ–1317’ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ఫస్లీ చట్టమే ఇప్పటివరకు అమల్లో ఉన్న అన్ని రకాల భూచట్టాలకు ఆధారం. అసలు ఈ ఫస్లి అన్నది అరబిక్ భాష నుండి ఉర్దూ లోకి దిగుమతి అయిన పదం. ప్రతి సంవత్సరం జులై నుండి జూన్ వరకు గల 12 నెలల కాలాన్ని ఫస్లి గా నిర్ణయించారు. నిజాం ప్రభుత్వం ఫస్లి సంవత్సరాన్ని రెవెన్యూ రికార్డులలో చేర్చిన నాటినుండి ఇప్పటివరకూ మనం దానినే అనుసరిస్తున్నాం. తెలంగాణాతో పాటూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కూడా తమ రెవెన్యూ రికార్డులలో ఫస్లి కాలెండర్ నే అనుసరిస్తున్నాయి. అన్ని చట్టాలు, భాగాలు, చాప్టర్లు, సెక్షన్లు కలిపి ఫస్లి చట్టం ఉండేది.

భూ పరిపాలనకు సంబంధించి అప్పటివరకు ఇదే సమగ్ర చట్టం. హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర ప్రదేశ్​ విలీనం తర్వాత  భూపరిపాలన, కౌలుదారులు, రైతుల  హక్కులు, భూసేకరణ, పంపిణీకి సంబంధించి ఇలా ఒక్కో అంశంపై ఒక్కో యాక్ట్​ రూపొందించారు. లేదంటే చట్టంలోనే రూల్స్​, కండిషన్స్​ను సబ్‌‌ సెక్షన్లుగా విడగొట్టారు. ఇలా చేస్తూ వచ్చిన చట్టాలు, జీవోలు కలిపితే వాటి  సంఖ్య 124కు చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటికే ఉన్న 196 చట్టాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌‌ భూమి రెవెన్యూ కోడ్‌‌-1999 ని రూపొందించారు. ఇందులో 17 భాగాలు, 47 అధ్యాయాలు, 260 సెక్షన్లను పొందుపరిచారు. అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపినా కేంద్ర న్యాయ శాఖ దాదాపు 140 ప్రశ్నలతో తిప్పి పంపింది. అయితే వీటన్నింటి స్థానంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మేలు చేసేందుకు భూమీ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు సూత్రాలు ప్రతిపాదించారు. అందులో మొదటిది రైతుల భూములు భద్రంగా ఉండాలని, ఇష్టమున్నట్టు వివరాలు మార్చేందుకు అవకాశం ఉండొద్దని. అయితే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే చిన్న, సన్నకారు రైతుల భూమి హక్కులు త్రిశంకు స్వర్గంలో పడ్డాయి. భద్రత మాట అటుంచితే అసలు తమ భూములు తమకు దక్కుతాయో లేదో అని సందిగ్ధంలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు. అసలు భూమిలేని వారి పేరున కొత్త పట్టాలు దర్శనమిస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం. ఇక రెండవది ప్రపంచంలో ఏ మూలన ఉన్నా రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలు కనిపించాలి. యజమానులు ఏ క్షణంలో అయి నా తమ భూమి వివరాలను చెక్‌ చేసుకొనేలా వ్యవస్థ ఉండాలన్నది.

తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు, రెవెన్యూ రికార్డులలో నమోదైన వివరాలు కూడా నేడు ధరణి వెబ్సైట్ లో కనబడటం లేదు. మిస్సింగ్ సర్వే నంబరు పేరుతో సర్వీసు ఇచ్చినా దాని ఫలితాలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక మూడవది భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలని, రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఏకకాలంలో జరగాలని. కానీ ఆచరణలో మాత్రం సులభతరం అన్న మాటకు ఆస్కారం లేకుండాపోయింది. నేడు ధరణి పోర్టల్ సామాన్యులకు మాత్రమే కాదు అధికారులకు కూడా కొరుకుడు పడటం లేదు. అధికారులతో పాటు పౌరులకు కూడా సిటిజన్ లాగిన్ కల్పించినా దానివలన సామాన్యులకు పెద్దగా ఒరిగిందేమి లేదు. సిటిజన్ లాగిన్ ఓపెన్ చేయడానికి మళ్ళీ మళ్ళీ నెట్ సెంటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇక నిరక్షరాస్యుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇవన్నీ ఒక ఎతైతే అర్ధంకానీ రెవెన్యూ పదాలు సామాన్య ప్రజలకు మరో సమస్యగా మారాయి. నిజాం కాలం నుండి ఉర్దూ పదాలు రెవెన్యూ రికార్డులలో సింహభాగం ఆక్రమించాయి. భూముల రకాలు, శిస్తు రకాలు ఇలా అన్నింటికీ ప్రత్యేకంగా ఉర్దూ పదాలు వినియోగించబడ్డాయి. ఇప్పటికి చాలా సమస్యలకు అర్ధంకాని ఈ పదబంధాలు కూడా సామాన్య ప్రజల కష్టాలకు కారణమవుతున్నాయి. భూమి మార్పుకోసం, క్రయ విక్రయాల కోసం వెళ్ళినప్పుడు తమ భూమి ఏ రకానికి చెందినదని తెలియక తమ ధరఖాస్తులు ఎందుకు తిరస్కరించారో తెలియక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. రెవెన్యూ రికార్డులకు కూడా ఉర్దూ భాషలోనే పేర్లు ఉండటం అవి ఇంకా కొనసాగుతుండటం వలన వాటికి అర్ధం తెలియనప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో సామాన్య ప్రజలకు తెలియాల్సిన కొన్ని రెవెన్యూ పదాల గురించి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను.

అడంగళ్ లేదా పహాణి:– గ్రామంలో సాగు భూముల వివరాలను నమోదు చేసే రిజిస్టరు. దీనిని ఆంధ్ర ప్రాంతంలో అడంగళ్‌, తెలంగాణ ప్రాంతంలో పహాణీ అని పిలుస్తారు. ఈ రిజిస్టరును గ్రామ లెక్క నెంబరు 3 అని కూడా అంటారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ- పహాణీలు జారీ చేస్తున్నారు. ఈ రిజిస్టరులో గ్రామంలోని అన్ని భూముల వివరాలను ప్రతి సంవత్సరం నమోదు చేస్తారు.
బంచరాయి:- గ్రామంలో పశువుల మేతకు ఉద్దేశింపబడిన ప్రభుత్వ భూమి. గ్రామీణ ప్రాంతాలలో రైతులు, పశువుల పెంపకంపై ఆధారపడి జీవించేవారు అధికంగా ఉంటారు. వారి పశువులకు నిత్యం మేత అవసరం. కాబట్టి నివాసాలకు దూరంగా పచ్చిక ఉన్న ప్రాంతాన్ని పశువులు మేత మేయడానికి ప్రత్యేకంగా ప్రతీ గ్రామంలో గుర్తిస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. ఎవరికీ అధికారాలు ఉండవు.
హోమ్‌స్టెడ్‌:- అంటే గ్రామంలో, పట్టణంలో భూమి లేని రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిపనుల వారు ఇతరులకు సంబంధించిన భూములపై తేదీ 14.8.1975 నాటికి నివాసం ఏర్పర్చుకున్న స్థలాన్ని హోమ్‌స్టెడ్‌ అంటారు. అలాంటి భూముల్లో నివాసం ఉన్నవారికి తాత్కాలికంగా స్థానిక అధికారులు అనుమతులు ఇస్తారు.
అడ్వర్స్ పొజిషన్:- ప్రతికూల స్వాధీనం లేదా ప్రతికూల ఆధీనం. అంటే వాస్తవంగా భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని వాస్తవంగా, శాంతియుతంగా, నిరవధికంగా, బహిరంగంగా స్వాధీనంలో ఉంచుకొని దానిపై నియంత్రణాధికారాన్ని కలిగి ఉండటాన్ని అడ్‌వర్స్‌ పొసెషన్‌ అంటారు. పట్టా భూమిని 12 సంవత్సరాలు, ప్రభుత్వ భూమిని 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్నట్లయితే సివిల్‌ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు.

ఎలియనేషన్:- భూమి ఎలియనేషన్‌ అంటే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడం. ఎలియనేషన్‌ను వ్యక్తులకు, సంస్థకు, స్థానిక సంస్థలకుచేయవచ్చు. ఎలియనేషన్‌ను ఉచితంగాగాని, కొద్దిపాటి రుసుముతో గాని చేస్తారు.
ఆబాదీ/గ్రామకంఠం:- గ్రామంలో ప్రజలు నివసించడానికి ఉద్దేశించిన/ గ్రామాల్లో గృహ నిర్మాణాలు చేపట్టిన/చేపట్టే స్థలం.
అసైన్‌మెంట్‌ల్యాండ్‌:- ప్రత్యేకంగా కేటాయించిన భూమి. ప్రజాప్రయోజనార్థం ప్రభుత్వం నిర్వహించే భూమి. కొన్ని షరతులతో పేదలకు కేటాయించిన భూమి. పంపిణీ కోసం ప్రభుత్వం సేకరించే భూమిని కూడా అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ అంటారు.భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికిగాని, ఇళ్లు నిర్మించుకోవడానికి గాని ప్రభుత్వం మంజూ రు చేసిన భూమి. ఈ భూమిని వారసత్వంగా అనుభవించాలి. ఇతరులకు అమ్మరాదు, ఏ విధమైన బదిలీ చేయరాదు.
ఆబ్సెంటీ ల్యాండులార్డు:– పరోక్ష భూస్వామి. అంటే ఒక గ్రామంలో భూమి ఉండి వేరొకచోట నివాసముంటూ భూమిని సొంతంగా సాగుచేయని భూ యజమాని. కానీ భూమిపై హక్కులన్నీ అతడిచే చెందుతాయి.
బేవార్సు:- ఒక సొత్తుకు హక్కుదారు ఎవరో తెలియకపోతే దానిని ‘బేవార్సు ఆస్తి’గా పరిగణిస్తారు.
అసామిషిక్మీ:- భూ యజమానికి పన్ను చెల్లించే నిబంధనపై భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వ్యక్తి.
ఏడబ్య్లూడీ భూములు:- శిస్తు నిర్దారించిన ప్రభుత్వ భూములు, లేదా అసైన్డ్‌ వెస్ట్‌ ల్యాండ్‌ అంటారు. ఏడబ్య్లూడీ భూములు మెట్ట భూములయితే డైల్యాండ్‌ భూములని అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు అసైన్‌ చేయవచ్చు.
బి-మెమో:- ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించమని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు. ఇలా నోటీసులు అందుకున్న వ్యక్తులు పట్టడారులుగా పరిగణించబడరు.
భూదాన్‌భూమి:– భూదాన ఉద్యమంలో భాగంగా దానమిచ్చిన భూములు. వీటిని భూమిలేని పేదలకు పంచారు. ఈ భూములను మరోమారు అమ్మడానికి, అన్యాక్రాంతం చేయడానికి వీలులేదు.
ఇజారా:- ప్రభుత్వానికి చెందిన బంజరు భూములను వ్యవసాయానికి గానీ, నివా సం ఉండడానికి గానీ కొంత నిర్ధిష్టమైన పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకిచ్చే పద్ధతిని ‘ఇజారా’ అంటారు.
ఇస్తిఫా భూమి:- పట్టాదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి
ఇనాం దస్తర్‌దాన్‌:- పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి.
ఇనాంమాఫి:– శిస్తు లేని ఉచిత సేద్యభూమి. పీరీల పండుగ, శ్మశానాల నిర్వాహణకు ఇచ్చే భూములు.
అజమాయిషీ:- భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, గ్రామ రెవెన్యూ అధికారి రాసిన లెక్కల్లోని వివరాలను గ్రామంలో తనిఖీ చేసిన భూముల్లో కొన్నింటిని తహసీల్దార్‌ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ తనిఖీ చేయాలి. అలా తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్క నం.3 లో రాస్తారు. అజమాయిషీని ప్రతి సంవత్సరం నిర్వహించాలి.
చౌఫస్లా:- ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేరువేరు నంబర్ల భూముల పన్ను మదింపు రికార్డు.
చౌతాఇనాం:- నాలుగో వంతు పన్ను మాఫీ కలిగిన ఇనాం భూమి. గ్రామ సేవకులకు నాలుగోవంతు పన్ను మాఫీతో కేటాయించిన భూమి.
ఫౌతి/విరాసత్‌:- భూ యజమాని మృతి చెందిన తరువాత అతడి వారసులకు భూమిహక్కులు కల్పించడం.
బిల్‌మక్తా:- సాధారణ శిస్తుకంటే తక్కువ శిస్తు నిర్ణయించిన భూమి, గ్రామాన్ని గాని బిల్‌మక్తా అంటారు.
రెమిషన్‌:– అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టానికి గురైతే ప్రభుత్వం ఇచ్చే పన్ను మినహాయింపు
శివాయి జమాద్రా:- అనుమతి లేకుండా ప్రభుత్వ నీటి వనరులతో సాగు చేసిన భూమికి విధించిన అదనపు శిస్తు
ఖారజ్‌ఖాతా:- శిస్తు చెల్లించలేక, వారసులు లేక వదిలేయడం వల్ల ప్రభుత్వపరమైన భూమి.
సేత్వార్:- తెలంగాణ ప్రాంతంలో 1934 ప్రాంతంలో నైజాం సర్కారు భూముల బందోబస్తు(ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌) చేసింది. ఒక పద్ధతి ప్రకారం భూములకు సర్వే నంబర్లు, మ్యాపులతో సహా రికార్డులను రూపొందించింది. దీనినే తెలంగాణలో సేత్వార్‌ పహాణీ అని అంటారు. వీటిలో కేవలం ప్రధాన సర్వే నెంబర్లకు సంబంధించి వివరాలు ఉంటాయి.
డైగ్లాట్‌:- రాష్ట్రంలోని ప్రతి గ్రామం లో సర్వే సెటిల్‌మెంట్‌ కార్యకలాపాలు పూర్తిచేసి ప్రతి గ్రామంలో భూముల వివరాలను నమోదు చేస్తారు. ఇందులో అన్నిరకాల భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, అవి సర్కారా, ఇనాం భూములా, మాగాణియా, మెట్ట భూములా, వాటి వర్గీకరణ, శిస్తు మొదలగు వివరాలుంటాయి. ఈ రిజిష్టర్‌ను ఆంగ్లంలో, తెలుగులో రాస్తారు. అందుకే ‘డైగ్లాట్‌’ అంటారు. దీనినే శాశ్వత ఏ రిజిస్టర్‌గా పరిగణిస్తారు. ఈ రిజిస్టరు మిగిలిన గ్రామ రెవెన్యూ రికార్డులన్నిటికీ మూలస్తంభంలాంటిది.
ఎన్‌డార్స్‌మెంట్‌:- గ్రామంలో ప్రజలు, ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియజేయు విధానం.
ఖాస్రాపహానీ:- ఉమ్మడి కుటుంబాల్లో ఒకే వ్యక్తి పేరుమీద ఉన్న భూరికార్డులను మార్పు చేస్తూ, నిజాం ప్రభుత్వం తొలిసారిగా రైతువారీగా భూమి పట్టా హక్కు కల్పించిన పహానీ. దీనిని 1953-54లో ప్రవేశ పెట్టారు. సేత్వార్‌ పహాణీ తర్వాత ఇది చాలా ముఖ్యమైనది. అందుకని ఇప్పుడు భూ పరిష్కరించేందుకు ఈ పహణీ ఒక ఆధారంగా పనిచేస్తుంది. మీ భూమి గనుక ప్రభుత్వ నిషేదిత జాబితాలో పడితే అందులో నుంచి మీ భూమిని తొలగించడానికి ఇది చాలా ముఖ్యం.
ఆర్‌ఓఆర్‌(రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌)-1బి:- దీన్నే భూ యాజమాన్య హక్కుల పుస్తకం అంటారు. ఆర్‌ఓఆర్‌ ని 1-బి అని కూడా అంటారు. గతంలో దీన్నే టెన్‌వన్‌ అడంగల్‌ అనే వారు. ఎవరెవరికి ఎంతెంత భూమి ఏవిధంగా సంక్రమించిందనే సమాచారం ఇందులో ఉంటుంది.
నక్ష:- శాశ్వత ఏ రిజిష్టరు ప్రకారం గ్రామంలోని మొత్తం భూములన్నింటిని రేఖా చిత్ర పటంలో చూపించేదే గ్రామ నక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామ భౌతిక రూపం గ్రామ పటం రూపంలో కనిపిస్తుంది. గ్రామంలోని భూములను గుర్తించుటకు గ్రామ నక్ష ఉపయోగపడుతుంది. తెలంగాణలో నక్ష అని,ఏపీలో గ్రామ పటం అని అంటారు.
ఆర్‌ఎస్‌ఆర్‌:– దీన్నే రీసర్వే రిజిస్టర్‌ అంటారు. సర్వే నంబర్ల వారీగా భూమి విస్తీర్ణం, హక్కుదారుల వివరాలతో దీన్ని తయారు చేశారు. ఇది రెవెన్యూ శాఖలో అత్యంత ప్రామాణికమైనది.
ఎఫ్ఎంబి/ టిప్పన్:- శాశ్వత ఏ రిజిష్టరు ప్రకారం గ్రామంలో గల భూములన్నింటిని సర్వే నంబరు వారీగా, సబ్‌ డివిజన్‌ నంబరు వారీగా కొలతలు, విస్తీర్ణంతో సహా తెలియచేయు రిజిష్టరు ఎఫ్ఎంబి) /టిప్పన్‌. ఇందులో ఒక్కొక్క సర్వే నంబరుకు ఒక్కొక్క పటము ఉండును.

వీటన్నింటిని వరుస క్రమంలో పెట్టి తయారు చేసిన కొలతల పుస్తకం. దీనిని ఆంధ్రా ప్రాంతంలో ఎఫ్‌.ఎం.బి. అని, తెలంగాణ ప్రాంతంలో ‘టిప్పన్‌’ అని పిలుస్తారు. ఈ రికార్డు సరిహద్దు వివాదములను పరిష్కరించుటకు ఉపయోగ పడుతుంది.
పోడి:– సాధారణ పదాలలో చెప్పాలంటే, వ్యవసాయ భూమి యొక్క పోడి అంటే సర్వే సంఖ్యలను వివిధ ఉప విభాగాలుగా విభజించడం. దీన్ని సర్వే శాఖ అధికారులు చేస్తారు. ఏదైనా వ్యవసాయ భూమిని కొనడానికి లేదా విక్రయించడానికి ముందు భూమి పోడిని పొందడం తప్పనిసరి. వేల ఎకరాలున్న గట్ నెంబరు, అసైన్మెంట్ భూములలో పోడి జరగకపోవడం వలన చాలామంది సామాన్య రైతులు నేడు పట్టాలు రాక ఇబ్బందులు పడుతున్నారు.

లవుణి పట్టా:- రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించబడిన భూమి. అంటే నిస్సందేహంగా ఇది ప్రభుత్వ భూమి. కేటాయించబడిన వారికే తప్ప ఈ భూములపై క్రయవిక్రయాలు నిషేధం. స్వాతంత్ర్య సమరయోధులకు, ఉగ్రవాద బాధిత కుటుంబాలకు, ఎక్స్ సర్వీస్ మెన్, రాజకీయ, సామాజిక బాధిత కుటుంబాలకు, సంవత్సర ఆదాయం పదకొండు వేలకంటే తక్కువ ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయిస్తుంది. క్రయవిక్రయాలకు మాత్రమే కాక ఎటువంటి మార్పులకు కూడా చట్టపరమైన అవకాశం ఉండదు.

గ్రామ లెక్క నం. 1:- ప్రభుత్వ భూములు, కౌలుకు ఇవ్వబడిన భూములు, దరఖాస్తు భూములు, అన్యాక్రాంతములు, దరఖాస్తు కింద పట్టాకు ఇవ్వదగు విస్తీర్ణం తెలియజేయు రిజిష్టర్‌.
గ్రామ లెక్క నం. 2:- భూముల ఆధీనంలో మార్పులను తెలియజేయు రిజిష్టర్‌
గ్రామ లెక్క నం. 3:- పహాణీ/అడంగల్‌ – భూమి అనుభవము, ఆక్రమణ, సాగుబడి తెలియచేయు రిజిష్టర్‌
గ్రామ లెక్క నం. 4:- భూకమతం, భూమి శిస్తు డిమాండు రిజిష్టర్‌
గ్రామ లెక్క నం. 5:- భూమి డిమాండు, వసూలు, విలువ తెలియజేయు లెక్క
గ్రామ లెక్క నం 6:- రోజువారి వసూలు తెలియజేయు లెక్క
గ్రామ లెక్క నం 7:- ఇర్సాలునామా లేదా చలానా అని కూడా అంటారు. దీని ద్వారానే ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూ మి శిస్తు, వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు.
గ్రామ లెక్క నం 8:- జలాధారములను తెలుపు రిజిష్టర్‌
గ్రామ లెక్క నం 9:- భూమి శిస్తు చెల్లింపునకు రశీదు
గ్రామ లెక్క నం 10,11:- జనన, మరణములు నమోదు చేయు రిజిష్టరు.

వ్యాసకర్త:- గంగాధర కిశోర్ కుమార్
(ఆర్టీఐ ఆక్టివిస్ట్, అంతర్జాతీయ మానవహక్కులు మరియు నేర నిరోధక సంస్థ శాశ్వత సభ్యుడు)