Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు : సీఎం జగన్‌

తాడేపల్లి: జిల్లా స్థాయిలో వికేంద్రీకరణతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఇవాళ అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం క్యాంప్‌ కార్యాలయంలో.. కొత్త జిల్లాలను ప్రారంభించిన అనంతరం జిల్లాల ఏర్పాటు ఆవశ్యకతను ఆయన స్వయంగా వివరించారు. అంతకు ముందు 26 జిల్లాల ఏపీ రాష్ట్రంగా రూపుమారుతున్న సందర్భంగా.. ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

కొత్త జిల్లాల పేర్లను స్వయంగా చదివి వినిపించిన ఆయన.. ప్రజల సెంటిమెంట్లను, గొప్పవాళ్లను పరిగణనలోకి తీసుకున్నాకే జిల్లాలను ఏర్పాటు చేశామని, వాటికి పేర్లు కూడా పెట్టినట్లు వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు అని మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్‌.. గతంలో ఉన్న జిల్లాలు యథాతధంగానే ఉంటాయని గుర్తు చేశారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని, జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని పేర్కొన్నారు.