జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం సమగ్ర సర్వేపై వైఎస్ జగన్ సమీక్ష

లంచాలు, అవినీతిని అరికట్టేందుకు జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షలో భాగంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి, ఈ విషయంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై గురువారం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.సమీక్షలో సీఎం జగన్‌కు సమగ్ర సర్వే వివరాలను అధికారులు అందించారు. దీంతోపాటు సమగ్ర భూ సర్వే కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్‌లను సీఎం జగన్ పరిశీలించారు. ఏప్రిల్ 5లోగా భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లను వినియోగించి పనులు వేగవంతం చేసేందుకు మరో 20 డ్రోన్లను కొనుగోలు చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.
వెబ్‌ల్యాండ్‌లోని సమస్యలను పరిష్కరించాలని, అవినీతి, లంచాలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా పనులు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆలస్యంగా అధికారులకు సూచించారు. రికార్డులను ఎవరూ తారుమారు చేయని విధంగా తయారు చేసేందుకు విధివిధానాలు పాటించాలని, ఎస్‌ఓపీలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ పద్ధతులే కాకుండా ఫిజికల్ రికార్డులను కూడా సిద్ధం చేయాలని, ఫిజికల్ డాక్యుమెంట్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని అధికారులకు సూచించారు. సబ్ డివిజన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్వే జరిగేలా చూడాలన్న సీఎం జగన్.. చివరకు సచివాలయ స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు జరగాలని స్పష్టం చేశారు.ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, సీసీఎల్‌ఏ స్పెషల్ సీఎస్ జీ సాయిప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.