18 గంటల పాటు లాకర్ గదిలోనే వృద్ధుడు

  • జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంకులో దారుణం

హైదరాబాద్ మార్చి 29 (నిజం న్యూస్):హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంకులో దారుణం చోటుచేసుకుంది. బ్యాంకు లాకర్ గదిలో ఓ వృద్ధుడు ఉన్నాడనే విషయాన్ని గమనించకుండా సిబ్బంది బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయారు.
దీంతో సదరు వృద్ధుడు 18 గంటల పాటు లాకర్ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం 4:20 గంటలకు కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు లాకర్ పని మీద యూనియన్ బ్యాంకుకు వెళ్లాడు. లాకర్ గదిలో ఆయన ఉండగానే బ్యాంకు పనివేళలు ముగియగానే సిబ్బంది గమనించకుండా బయటి నుంచి లాకర్ గది మూసి తాళం పెట్టారు. అయితే వృద్ధుడి వద్ద సెల్‌ఫోన్ కూడా లేదు.

ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలు చూడగా, కృష్ణారెడ్డి బ్యాంకులోనే ఉండిపోయినట్లు గుర్తించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బ్యాంకు లాకర్ నుంచి ఆ వృద్ధుడిని పోలీసులు బయటకు తీసుకు వచ్చారు. కృష్ణారెడ్డి మధుమేహం, బీపీతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.