నూతనకల్ లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై అధికార పార్టీ నాయకుడి కన్ను

నూతనకల్ మార్చి 29 (నిజం న్యూస్)

నూతనకల్ మండల కేంద్రంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీ భర్త  అధికార దర్పంతో అక్రమంగా ఆక్రమించుకొన్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలలోకి వెళ్తే సూర్యాపేట -దంతాలపల్లి ప్రధాన రహదారి పక్కన విజయమేరి పాఠశాల ఎదురుగా 461సర్వే నెంబర్ లో రెవిన్యూ రికార్డ్ లో 27 గుంటల ప్రభుత్వ స్థలం కలదు.   రోడ్ విస్తరణ కింద దీనిలో పది గుంటలు పోగా, ఇంకా 17గుంటల భూమి ఉంది.  అక్కడ సుమారు ఒక గుంట 10నుండి 15లక్షలు ధర పలుకుతుంది.  దీనిపై అధికార పార్టీ నాయకుని కన్ను పడింది, ఇదే నాయకుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయగా దళితులు సర్పంచ్ కు  పిర్యాదు చేయడంతో, అప్పుడు ఆ  సర్పంచ్ ఆ భూమిని ఆక్రమించుకోవడానికి వీలు లేదని అడ్డుకోవడంతో సదరు నాయకుడు వెంటనే ఆ భూమి కోసం అధికార పార్టీ లో చేరాడని తెలుపుతున్నారు. ఇప్పుడు  అధికార బలంతో భూమిని ఆక్రమించుకోగా కొంత మంది దళిత మహిళలు అడ్డుకోగా మహిళలు అని చూడకుండా వారి పై దాడి చేయించాడని తెలుపుతున్నారు.

also read : ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు…రాయపూర్ ఆసుపత్రికి తరలింపు

ఈ విషయమై మహిళలు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.  తహసీల్దార్ కు పిర్యాదు చేశారు అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత రాద్ధాంతం అవుతున్న తహసీల్దార్ అది ప్రభుత్వ భూమా, లేక ప్రయివేట్ భూమా అనే విషయం తెలపక పోవడం గమనార్హం.  గతం లో సైతం ఈ నాయకుడు ప్రభుత్వ భూములను  ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు  నాయకుడు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి కుమారుడు కావడం మరో విశేషం. జిల్లా కలెక్టర్ స్పందించి 461సర్వే నెంబర్ లో ఉన్న భూమిపై విచారణ నిర్వహించి ఆ భూమిని నిరుపేద దళితుల కు పంపినీ  చేయాలని కోరుచున్నారు.