మేకపాటి గౌతమ్ రెడ్డి స్మారక కార్యక్రమంలో పాల్గొననున్న వైఎస్ జగన్

దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరుకు రానున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి సంతాప సభ జరిగే వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ వరకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కన్వెక్షన్ సెంటర్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆదివారం నగరంలోని ఉమేష్‌చంద్ర స్మారక సమావేశ మందిరంలో ఎస్పీ సిహెచ్.విజయరావు బందోబస్తు విధుల్లో నిమగ్నమైన సిబ్బందితో సమావేశమై తాను పర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. సిబ్బంది అందరూ విధిగా యూనిఫాం, ఐడీలు ధరించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, విధులకు గైర్హాజరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. షెడ్యూల్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి 11.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుని 11.50 గంటలకు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. ఉదయం 11.50 గంటల నుంచి 12.40 గంటల వరకు జరిగే సంతాప సభలో పాల్గొని హెలిప్యాడ్‌కు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్‌లో తిరిగి రేణిగుంట వెళ్లి తద్వారా ప్రత్యేక విమానంలో 1.20 గంటలకు గన్నవరం చేరుకుంటారు. సీఎం వెళ్లే దారిలో ట్రాఫిక్‌ను నిషేధించాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.కాగా, ఆదివారం నెల్లూరులో ట్రయల్న్ కాన్వాయ్ జరిగింది. హెలిప్యాడ్ నుంచి బయలుదేరిన ట్రయల్ కాన్వాయ్ వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని అక్కడి నుంచి తిరిగి పోలీసు పరేడ్ హెలిప్యాడ్‌కు చేరుకుంది.
ట్రయల్ కాన్వాయ్‌ను ఎస్పీ విజయరావు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీతో పాటు ముగ్గురు ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 28 మంది సీఐలు, 89 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు/హెచ్‌సీలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, మొత్తం 1000 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.