పిల్లలతో చెరువులో దూకిన తల్లి..ముగ్గురు మృతి

– కుటుంబ కలహాలే కారణం

గంభీరావు పేట మార్చి 18(నిజం న్యూస్ ):

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పండుగపూట తీవ్ర విషాదం నెలకొంది. గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువులో నుంచి ఐదేళ్ల అన్షిక, మూడేళ్ల అభిగ్న మృతదేహాలను శుక్రవారం ఉదయమే వెలికితీసారు . కుటుంబ కలహాలే కారణమని బంధువులు చెబుతున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వర్కుటి రాజుకి అదే మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన రేఖతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తగాదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పండగపూటే తల్లి సహా పసి పిల్లలు చెరువులో విగత జీవులుగా తేలియాడడం గ్రామస్థులను తీవ్రంగా కలిచివేసింది. ఘటనా స్థలం వద్ద రేఖ బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. అత్త, భర్త వేధింపుల వల్లనే రేఖ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. ఆగ్రహావేశాలతో ఉన్న రేఖ బంధువులు ఆమె భర్త రాజు ఇంటిలోని ఫర్నిచర్​ని ధ్వంసం చేశారు. భర్త రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని ఎల్లారెడ్డిపేట పోలీస్​స్టేషన్​కు తరలించారు. పరిస్థితి అదుపు తప్పకుండా కొత్తపల్లి గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.