భర్త వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య

హైదరాబాద్ బ్యూరో మార్చి 17 (నిజం న్యూస్)
అదనపు కట్నం కోసం భర్త వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సోదరుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమె బ్యాంకులో ఉద్యోగిని. భర్త కూడా బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌. మూడేళ్ల క్రితమే పెళ్లయింది. రెండేళ్ల బాబు. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. హనుమకొండ జిల్లా గోపాలపూర్‌లోని బ్యాంక్‌ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన జాటోతు అనూష(28) హనుమకొండ యూనియన్‌ బ్యాంకులో క్లర్క్‌. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్‌పల్లికి చెందిన లావుడ్యా ప్రవీణ్‌నాయక్‌ హంటర్‌రోడ్డులోని యూనియన్‌ బ్యాంకు శాఖలో అసిస్టెంట్‌ మేనేజర్‌. 2019లో రూ.20 లక్షల కట్నంతోపాటు ఇతర లాంఛనాలు ఇచ్చి అనూషకు వారి కుటుంబసభ్యులు ప్రవీణ్‌నాయక్‌తో వివాహం జరిపించారు. అయినా ప్రవీణ్‌ అదనపు కట్నం కోసం భార్యను మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఖమ్మంలో రూ.కోట్ల విలువ చేసే ఎకరం భూమిని కూడా ఇచ్చేందుకు ఆమె కుటుంబసభ్యులు సిద్ధపడ్డారు. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది.  ఆమె మంగళవారం అర్ధరాత్రి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.*