చేయి చేయి కలుపుదాం నవ సమాజాన్ని నిర్మిద్దాం.

చేయి చేయి కలుపుదాం నవ సమాజాన్ని నిర్మిద్దాం.!

డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ రాష్ట్రం చీఫ్ కోఆర్డినేటర్

తుంగతుర్తి ,మార్చి 15, నిజం న్యూస్.

చేయి చేయి కలుపుదాం జ్ఞాన సమాజాన్ని నిర్మిద్దాం అని డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తెలంగాణ రాష్ట్రం చీఫ్ కోఆర్డినేటర్ అన్నారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని బౌద్ధ క్షేత్రం పనిగిరిలో నిర్వహించిన తొమ్మిదవ  జ్ఞాన దీక్షే భీమ్ దీక్ష  కార్యక్రమం నిర్వహించారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..మనిషికి అంటగట్టిన కులాన్ని రద్దు చేసి ఎలాంటి హీనమైన గుర్తింపులు లేకుండా చేయడమే భీమ్‌దీక్ష ఉద్యమ ఆశయం. నేడు కాన్షీరాం జయంతితో మొదలుకొని ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి దాకా నిర్వహిస్తారు. వ్యవస్థను కేవలం వ్యాఖ్యానిస్తూ కూర్చోక దాన్ని మార్చటానికి మన వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. సమ సమాజ స్థాపన దిశగా విద్యే ఆయుధంగా దూసుకుపోయే, అంబేద్కర్ ఆశయ సాధనకు పాటు పడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ, మహిళలు, ఇంకా ప్రతి ఒక్కరూ ఈ దీక్షలో పాల్గొని , ప్రతీ స్వేరో తమ పూర్వీకులైన గౌతమ బుద్ధ, ఛత్రపతి శివాజీ, సమ్రాట్ అశోక్, మహాత్మ జ్యోతిరావుఫూలే, సావిత్రిబాయి ఫూలే, నారాయణగురు, పెరియార్ రామస్వామి, సంత్ రవిదాసు, అయ్యంకళి, బాబాసాహెబ్ అంబేద్కర్, మదర్ రమాబాయి, కొమురం భీం, కన్షీరాం మొదలగు మహనీయుల త్యాగాలను స్మరించుకొని వాటి పునాదిగా కొత్త తరాన్ని నిర్మించడానికి సంసిద్ధులు కావాలి. ఈ మహా పవిత్రమైన ప్రస్థానానికి సంకల్ప సిద్ధులను గావించడానికీ, వ్యక్తులను వ్యవస్థీకృత శక్తులుగా ఏకీభవింపచేయటానికీ, కుటుంబ సమేతంగా ఆనందకరమైన జీవితాలను సమాజంతో కలిసి జీవించడానికీ ఏర్పాటు చేసిన మహత్తర జీవన విధానమే స్వేరో దీక్ష. అదే మన భీమ్ దీక్ష.ఈ దీక్ష సమయంలో ప్రతీ స్వేరో మానసికంగా, శారీరకంగా, జ్ఞానపరంగా శక్తివంతులై లక్ష్య సాధనకు సంసిద్ధులవ్వాలి.

ఈ కార్యక్రమంలో భీమ్ దీక్ష చీఫ్ కన్వీనరు పొడపంగి రాధా, భీమ్ దీక్ష ప్రారంభం కన్వీనరు మిరియాల మధు, స్పెరో అనుబంధ సంఘాల అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, స్వేరో అనుబంధ సంఘాల నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్స్ ,ఇన్చార్జులు, వివిధ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.