Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అడవాళ్లు మీకు వేల వేల వందనాలు

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

వరంగల్ ,మార్చి 8(నిజం న్యూస్)

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని,ప్రభుత్వాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు,ఘనంగా నిర్వహిస్తారు.కానీ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు,అనే విషయం చాలా మందికి తెలియదు. శ్రామిక ఉద్యమంగా మొదలైన మహిళా దినోత్సవం,ఇవాళ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మహిళలు ఎంత వరకు ఎదిగారు తెలుసుకుని,వేడుక చేసుకునే రోజు, అసలు మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు ,ఈరోజు వెనుక చరిత్ర ఏమిటి ..
అమెరికాలోని పశ్చిమ పెన్సిల్వెనియా లో గల ,ఒక కాటన్ మిల్లు లో మహిళలు పురుషులతో పాటుగా తమకు కూడా సమాన వేతనం, తక్కువ పని గంటలు, ఓటు హక్కు, కల్పించాలని కోరుతూ ఉద్యమం చేశారు.ఈ ఉద్యమం తీవ్రస్థాయికి చేరి 1857 మార్చి 8 వ తేదీన ఈ ఉద్యమం విజయవంతం అయింది.ఈ సమ్మెను స్ఫూర్తిగా తీసుకొని న్యూయార్క్ నగరంలో పదిహేనువేల మంది మహిళలు ప్రదర్శన చేశారు, అది కూడా విజయవంతం కావడంతో అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటించింది.1911వ సంవత్సరంలో జరిగిన మహిళా దినోత్సవంలో ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ, స్విజర్లాండ్, దేశాలలోని మహిళలు వేల సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు,1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటించింది.
వేద కాలంలో మహిళకే మొదటి స్థానం ఉండేది. ఇంటి పెత్తనం మొదలుకొని అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న మహిళలు ఉన్నారు. శాస్త్ర విషయాల గురించి తెలియజేసిన వారు ఉన్నారు,తర్వాత కొన్ని మూఢ నమ్మకాలు,చాదస్తాలు వారి స్థానాన్ని కిందికి దించాయి.ఆడవారు చదువుకోకూడదు, బయటకి రాకూడదు,అనే ఆంక్షలతో మహిళలను వంటింటికే పరిమితం చేశారు,ఇంకా ఎన్నో నిర్బంధాలు.ఈ విధంగా సంకెళ్ళలో చిక్కుకున్న మహిళలను అబల అన్నారు. ఆడవాళ్ళు అంటే ఇంట్లో వంట చేయడం వరకే అని హద్దులు గీచారు. దీని ఫలితంగా ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైయ్యారు. అనేకమైన దురాచారాలకు బలిపశువులయ్యారు. కొన్నాళ్ళు కన్యాశుల్కం సమస్య,వరకట్నం వేధింపులు,ఇలా అనేక ఇబ్బందులను మహిళలు ఎదుర్కుకున్నారు, యుద్ధ రంగంలో వీర విజృంభణ చేసిన రాణీ లక్ష్మీబాయి నుంచి నేడు ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను పంపిన ఇస్రో మహిళా శాస్త్రవేత్తల వరకు వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్త్రీలు నిరూపిస్తున్నారు,సైన్స్, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం అభివృద్ధి చెందడానికి మహిళలు అద్భుతమైన కృషి చేస్తున్నారు.మహిళలు ఇప్పుడు త్రీవిధ దళాలలో యుద్ధరంగంలో కూడా పురుషులతో సమానంగా పోటీనిస్తున్నారు.క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన సానియా మీర్జా, పి. వి. సింధు, సైనా నెహ్వాల్, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, మేరీ కామ్‌ల పేర్లు ఇవాళ మహిళ కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారు. 1984లోనే బచేంద్రపాల్ మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా కీర్తించబడ్డారు.అనేక అవరోధాలను, అడ్డంకులను దాటి కొత్త పుంతలు తొక్కుతున్న ఇలాంటి మహిళలు అనేక మంది ఉన్నారు.ఐక్యరాజ్యసమితి 1975 మార్చి 8 నుంచీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతుంది.అప్పటి నుంచీ ఇప్పటి వరకూ సమాజంలో స్త్రీల పట్ల గౌరవం, వారి అభివృద్ధి లో మార్పు కనపడుతున్నది.మహిళల భాగస్వామ్యం లేకుండా, దేశ అభ్యున్నతిలో వారు పాత్ర పోషించకుండా దేశం అభివృద్ధి చెందలేదు,ఒకప్పుడు కేవలం మగవాళ్ళే చేయదగ్గ పనులన్నింటినీ ఈనాడు ఆడవాళ్ళు చేస్తున్నారు. ఎన్నో రంగాలలో ఆడవాళ్ళు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ ప్రగతిని చూసే ఒక సినిమా కవి – ” లేచింది మహిళా లోకం – నిద్ర చేచింది మహిళా లోకం – దద్దరిల్లింది పురుష ప్రపంచం” అన్నాడు.నిజానికి మన దేశాన్నే మనం ఒక స్త్రీగా మాతృమూర్తి గా, భారత మాతగా భావిస్తున్నాం.అందుకే మన దేశంలో నదులను సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరీ అని స్త్రీ పేర్లతో పిలుస్తున్నాం.స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేతనాలు, సమాన ఆస్తి, సమాన సాధికారిత సాధించడం, వారిపై అన్ని రకాల వివక్షకు తావు లేకుండా చూడడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి.

వ్యాసకర్త,
ప్రసన్న లక్ష్మి దండే
ఎం.ఏ